మొబైల్.. ఇండియా!
భూమి తన చుట్టూ తాను తిరుగుతోందన్నది ఎంత నిజమో... ఇపుడు మొబైల్ ఫోన్ చుట్టూ తిరుగుతోందన్నది కూడా అంతే నిజం. ఈ-కామర్స్, స్టార్టప్‌లు, గేమింగ్, టెలికం, ఇంటర్నెట్... ఇలా ఏ రంగమైనా మొబైల్ చుట్టూనే తిరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇది మనిషికిపుడు కనిపించే గుండెకాయ. ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేని పరిస్థితి. అందుకే... ఇది మొబైల్ నామ సంవత్సరం. ఈ ఒక్క ఏడాదే కాదు. మరికొన్నేళ్లు ఈ మొబైల్ మేనియాకు అడ్డుండదు.
దేశంలో 80 కోట్లు దాటేసిన మొబైల్ ఫోన్లు
⇒ 180కి పైగా బ్రాండ్లు; 2,700కు పైగా మోడళ్లు
⇒ రెండేళ్లలో విక్రయాల్లో చైనా తర్వాతి స్థానంలోకి
⇒ రూ.10 వేల లోపు మొబైల్స్‌లోనూ బోలెడు ఫీచర్లు
⇒ తయారీలోకి పలు కంపెనీల ప్రవేశం
⇒ 2016లోనూ కొనసాగనున్న మొబైల్స్ అమ్మకాల జోరు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌ఫోకస్, డాజెన్, మీజు, వివో, నుబియా, ఓబి, ఫికామ్, బ్లూ... ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? శామ్‌సంగ్, యాపిల్‌కు దాయాదులు. ఇవే కాదు. దేశీయంగా ఒక స్థాయిని సంతరించుకున్న కంపెనీల్లో మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, సెల్‌కాన్, కార్బన్... ఇలా చాలానే ఉన్నాయి. మొత్తంగా మన మార్కెట్లో ఇపుడు 180కి పైగా బ్రాండ్లు పోటీ పడుతున్నాయి.
‘‘భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగం ఏ స్థాయిలో ఉందంటే... దీన్నిపుడు ఏ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కంపెనీ విస్మరించే సాహసం చేయలేకపోతోంది’’ అనేది స్ట్రాటజీ అనలిటిక్స్ మాట. అందుకేనేమో! గతంలో అమ్మకాలకే పరిమితమైన కంపెనీలిపుడు తయారీకి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఫీచర్‌ఫోన్లు వాడుతున్న 8 కోట్ల మంది 2016లో స్మార్ట్‌ఫోన్లకు మళ్లుతారనే అంచనాలున్నాయి.
‘‘ఇండియా అనేది ఓపెన్ మార్కెట్. అందుకే కంపెనీలిక్కడకు వస్తున్నాయి’’ అనేది కార్బన్ మాట. ఫాక్స్‌కాన్ వంటి కాంట్రాక్ట్ తయారీ దిగ్గజాలు భారత మార్కెట్లో అడుగు పెట్టడం ఈ రంగ కంపెనీలకు కలిసి రానుంది.
‘స్మార్ట్’ వాటాయే అధికం...
ఇండియాలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలిపి 2,700లకుపైగా మోడళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1,900పైగా స్మార్ట్‌ఫోన్లే. అందులోనూ రూ.10 వేల లోపువి 1,500 పైనే. స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో గ్రామాలు, మండలాలకు 33 శాతం వాటా ఉంది. ఆన్‌లైన్‌లో మాత్రమే అమ్ముతున్న ఎక్స్‌క్లూజివ్ మోడళ్ల వాటా 17 శాతం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2015లో అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ల సంఖ్య దాదాపు 150 కోట్లు.
2017 నాటికి ఇది 170 కోట్లకు చేరుతుంది. చైనా తర్వాత అమెరికా మార్కెట్‌ను తోసి రెండో స్థానానికి భారత్ ఎగబాకుతుందని స్ట్రాటజీ అనలిటిక్స్ చెబుతోంది. దీని ప్రకారం 2015లో 11.8 కోట్లు, 2017లో 17.4 కోట్ల స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో విక్రయమవుతాయి. 2017లో చైనాలో 50 కోట్లు, అమెరికాలో 16.9 కోట్ల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. దేశంలోని కస్టమర్ల వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల సంఖ్య 80 కోట్లను దాటినట్టు అంచనా.
దిగి వచ్చిన ధరలు...
ఖరీదైన ఫోన్లకే పరిమితమైన ఫీచర్లు రూ.10 వేల లోపు మోడళ్లలోకీ వచ్చేశాయి. 3జీబీ ఆపైన ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఫుల్ హై డెఫినిషన్ స్క్రీన్, అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్, షార్ప్ డిస్‌ప్లే, 12 ఎంపీ ఆపైన సామర్థ్యంగల కెమెరా, 8 ఎంపీ ఆపైన ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ ఫ్లాష్, ఫ్రంట్ ఆటో ఫోకస్, 1.4 ఆపైన గిగాహెట్జ్ ప్రాసెసర్, ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటివన్నీ ఈ ఫోన్లలో ఉంటున్నాయి.
4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్‌ప్రూఫ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్లతో కంపెనీలు పోటీపడుతున్నట్లు ‘లాట్’ మొబైల్స్ ఈడీ కృష్ణపవన్ చెప్పారు. 2014లో సగటు 4జీ మొబైల్ ధర రూ.25 వేలుంటే ఇప్పుడది రూ.5 వేలకు దిగింది. స్టేటస్ కోసం తప్ప మిగతా వారంతా రూ.25 వేలు పైబడ్డ ఫోన్లను కొనటం మానేశారని ‘టెక్నోవిజన్’ ఎండీ సికిందర్ చెప్పారు. రూ.50 వేల ఫోన్లలో ఉండే ఫీచర్లు రూ.15 వేల ఫోన్లలోకీ వచ్చేశాయన్నారు.
ఆన్‌లైన్‌కు పోటీగా రిటైల్..
ఒకప్పుడు భారీ డిస్కౌంట్లంటూ ప్రచారం చేసుకున్న ఈ-కామర్స్ కంపెనీల మాట మారింది. కస్టమర్లు సౌలభ్యం చూస్తున్నారని, అందుకే ఆన్‌లైన్ అమ్మకాలు పెరుగుతున్నాయని ఇప్పుడు చెబుతున్నాయి. ఆఫ్‌లైన్ విక్రేతల నుంచి వచ్చిన ఒత్తిడితో కొన్ని కంపెనీలు ఆన్‌లైన్ కోసం ప్రత్యేక మోడళ్లను తయారు చేస్తున్నాయి.
కొన్నయితే ఆన్‌లైన్‌కే పరిమితమవుతున్నాయి. నిజానికి ఆన్‌లైన్ కంటే ఇపుడు ఆఫ్‌లైన్‌లోనే మొబైల్స్ చవకగా లభిస్తున్నాయని బిగ్‌ిసీ చైర్మన్ బాలు చౌదరి చెప్పారు. ‘‘కస్టమర్లు చాలా తెలివైనవారు. ఎక్కడ తక్కువకిస్తే అక్కడే కొంటారు. ఆన్‌లైన్ మోసాల నేపథ్యంలో ఆఫ్‌లైన్ బాట పడుతున్నారు’’ అన్నారు.
భారీ విస్తరణకు చాన్స్...
దేశంలో స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నది 13 శాతమే కావటంతో... ఇక్కడ విస్తరణకు భారీ అవకాశాలున్నట్లు శామ్‌సంగ్ ఐటీ, మొబైల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి చెప్పారు. జనాభా వారీగా చూస్తే చైనాలో 42, రష్యాలో 41, బ్రెజిల్‌లో 24% మంది వద్ద స్మార్ట్‌ఫోన్లున్నాయి. భారత్‌లో 30 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు.
వీరిలో మొబైల్ ద్వారా నెట్‌ను వాడుతున్నవారి సంఖ్య 25 కోట్లు. ప్రీమియం మోడళ్ళ ‘ఆపిల్’ ఆదాయం భారత్‌లో 2009-10లో రూ.450 కోట్లు మాత్రమే. 2014-15లో ఇది రూ.6,300 కోట్లకు ఎగియడం మన మార్కెట్ జోరుకు నిదర్శనం. బంగారు, రోజ్ గోల్డ్ వర్ణంలో వచ్చిన ఆపిల్ ఫోన్లను రూ.1 లక్షకుపైగా వెచ్చించి మరీ బ్లాక్ మార్కెట్లో కొన్నారంటే అతిశయోక్తి కాదు.
భవిష్యత్ 4జీ మోడళ్లదే..
మొబైల్ కంపెనీలు టార్గెట్ చేస్తున్నది ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉన్న 15-25 ఏళ్ల యువతనే. వినూత్న ఫీచర్లతో, అందుబాటు ధరలో మోడళ్లను తేవటం ద్వారా ఇవి విజయవంతమవుతున్నాయి. లక్షల రిటైల్ దుకాణాలు దేశమంతా విస్తరించినా ఆన్‌లైన్ అమ్మకాలు పెరగటానికి కారణమిదే.
స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో ఆన్‌లైన్ వాటా 30 శాతం ఉందంటే వీరి వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ వాటా మార్చికల్లా 35 శాతానికి చేరుతుందని అంచనా. 2015-16లో 13 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయని యూ టెలివెంచర్స్ సీవోవో అమరీందర్ ధలివాల్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. వీటిలో 4జీ వేరియంట్ల వాటా 40%.
తయారీలోనూ పోటీ..
చైనాలో తయారీ వ్యయం పెరగటంతో మొబైల్ ఫోన్ కంపెనీలు ఇతర దేశాలవైపు దృష్టిసారించాయి. వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్ సహజంగానే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మేకిన్ ఇండియా ఆకర్షణతో విదేశీ దిగ్గజాలకుతోడు దేశీ బ్రాండ్లూ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి.
ఇప్పటికే శ్రీసిటీలో ఫాక్స్‌కాన్ భారీ యూనిట్లు నిర్మించింది. సెల్‌కాన్ చొరవతో హైదరాబాద్, తిరుపతిల్లో మొబైల్ తయారీ హబ్‌లు ఏర్పాటవుతున్నాయి. మైక్రోమ్యాక్స్, లావా, ఇంటెక్స్, కార్బన్, షావొమీ, ఇన్‌ఫోకస్, జియోనీ, వన్‌ప్లస్ వంటి కంపెనీలు భారత్‌లోనే తయారీ చేపడుతున్నాయి. అమ్ముడవుతున్న ఫోన్లలో 30 శాతం దేశీయంగా తయారీ లేదా అసెంబుల్ అయినవే.