ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీ వేదికగా ‘మహాకుంభ్ 5.0’
2047 నాటికి భారత్‌లో స్టార్టప్‌లు సాధించాల్సిన లక్ష్యాలపై దిశానిర్దేశం
దేశంలో 1,54,719 స్టార్టప్‌లు.. 17 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు
స్టార్టప్‌ల సంఖ్యలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక పైచేయి
దేశంలో మహిళల సారథ్యంలో నడుస్తున్న స్టార్టప్‌లు 48 శాతం
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్టార్టప్‌ల వాతావరణాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘స్టార్టప్ మహాకుంభ్ 2025’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. దీనిద్వారా వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి
భాగస్వామ్యాల ద్వారా కొత్త లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ద్వారా ‘స్టార్టప్ మహాకుంభ్ 5.0’నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2047 నాటికి భారత్‌లో స్టార్టప్‌లు సాధించాల్సిన లక్ష్యాలపై ఇందులో చర్చించి, దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా పాలసీలు, ప్రోగ్రామ్‌లు
దేశంలో స్టార్టప్‌ల వాతావరణానికి ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పాలసీలు, ప్రోగ్రాములను అమలు చేస్తోంది. నేషనల్ మెంటార్íÙప్ ప్లాట్‌ఫామ్, సీడ్ ఫండ్ సపోర్ట్, ఫండ్ ఆఫ్ ఫండ్ ఫర్ స్టార్టప్స్, స్టార్టప్ ఇండియా యాత్ర, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వంటివి చేపట్టింది. ఈ క్రమంలోనే భారతీయ స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయికి తమ కార్యకలాపాలను విస్తరించేలా స్టార్టప్ మహాకుంభ్ 2025ను కేంద్ర ప్రభుత్వ అనుబంధ విభాగం డీపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
దేశంలో ప్రస్తుతం 1.54 లక్షల స్టార్టప్‌లు
డీపీఐఐటీ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2016లో 502 స్టార్టప్‌లు ఉండగా.. 2024 నవంబర్ 24 నాటికి 1,54,719 స్టార్టప్‌లకు చేరాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 17 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. స్టార్టప్‌లలో అత్యధికంగా 17,618 స్టార్టప్‌లు ఐటీ సేవలు, 14,285 స్టార్టప్‌లు ఆరోగ్య రక్షణ, 9,047 స్టార్టప్‌లు విద్యా రంగానికి చెందినవి ఉన్నాయి. మొత్తంగా చూస్తే మహారాష్ట్ర (27,459 స్టార్టప్‌లు), కర్ణాటక (16,335), ఢిల్లీ (15,851) దేశంలో టాప్ మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 5,157 స్టార్టప్‌లు ఉన్నాయి. భారత్‌లోని స్టార్టప్‌లలో నాయకత్వ స్థాయిలో 48 శాతం మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం.
ఫలితాలను ఇస్తున్న పథకాలు
భారతీయ స్టార్టప్‌ల రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు ఫలిస్తున్నాయి. స్టార్టప్‌ల ఆవిష్కరణలు, వాణిజ్య భాగస్వామ్యాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్టార్టప్ ఐడియాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ‘స్టార్టప్ యాత్ర’236 జిల్లాలు, 23 రాష్ట్రాల మీదుగా సాగుతూ... 143 బూట్ క్యాంపులను, 300 చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. స్టార్టప్ బ్రిడ్జెస్ కార్యక్రమంలో భాగంగా 21 దేశాలతో భారతీయ స్టార్టప్‌లను అనుసంధానం చేశారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2024 నాటికి 1,165 స్టార్టప్‌లలో 21,221 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైంది.
యూనికార్న్‌ల వైపు అడుగులు..
కొద్దిపాటి పెట్టుబడులతో వినూత్న ఆవిష్కరణలతో ప్రారంభమైన సంస్థలు స్వల్పకాలంలో ఒక బిలియన్ డాలర్లకుపైగా (సుమారు రూ.8,629 కోట్లు) విలువ కలిగిన సంస్థగా ఎదిగితే యూనికార్న్‌లుగా పిలుస్తారు. 2016 నాటికి భారత్‌తో 11 యూనికార్న్‌లు ఉండగా.. 2014 నాటికి వాటి సంఖ్య 118కి చేరింది. ఎడ్‌టెక్ రంగంలో అన్ అకాడమీ, వేదాంత.. ఫిన్‌టెక్‌లో పేటీఎం, ఫోన్‌పే, జెటా.. ఈ–కామర్స్‌లో ఫ్లిప్‌కార్ట్, ఫస్ట్ క్రై.. హెల్త్ టెక్‌లో ఫార్మ్ ఈజీ వంటి సంస్థలు భారతీయ యూనికార్న్‌ల జాబితాలో ఉన్నాయి. ఇలా భారతీయ స్టార్టప్‌ల నుంచి మరిన్ని యూనికార్న్‌లు ఎదిగేందుకు ‘స్టార్టప్ మహాకుంభ్’దోహదం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment