క్యాంపస్ నుంచే స్టార్టప్.. | Startup with compass! | Sakshi
Sakshi News home page

క్యాంపస్ నుంచే స్టార్టప్..

Published Wed, Dec 30 2015 12:34 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

క్యాంపస్ నుంచే స్టార్టప్.. - Sakshi

క్యాంపస్ నుంచే స్టార్టప్..

క్యాంపస్ ప్లేస్‌మెంట్! అంటే సదరు కాలేజీలో చదువు పూర్తవుతున్నపుడే...
అక్కడి నుంచే ఏదో ఒక కంపెనీకి సెలక్ట్ కావటం.
నిన్నమొన్నటిదాకా ఒక విద్యా సంస్థ ఎంత గొప్పదో చెప్పటానికి ఇదే గీటురాయి.
అక్కడ ఎంతమందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్లు వచ్చాయి?
ఎలాంటి కంపెనీల్లో వచ్చాయి? ఎంత జీతంతో వచ్చాయి? ఇవన్నీ దాని ప్రమాణాలు
.
 
ఇప్పుడైతే ఈ కొలతలు మారిపోయాయి. ఆ విద్యా సంస్థ నుంచి ఎన్ని స్టార్టప్‌లు వచ్చాయి? ఎన్ని సక్సెస్ అయ్యాయి? అక్కడ స్టార్టప్స్‌ను ప్రోత్సహించే వ్యవస్థ ఎలా ఉంది? ఇవీ తాజా ప్రమాణాలు. అందుకే ఐఐటీలు, ఐఐఎంలు సైతం తమ క్యాంపస్‌లలోనే...  తమ విద్యార్థులతోనే స్టార్టప్‌లు పెట్టిస్తున్నాయి. వాటికి పెట్టుబడి కూడా పెడుతున్నాయి.

 
యువశక్తే ఇండియా బలం. టెక్నాలజీ అండతో ఆ యువత స్టార్టప్‌ల వెంట పడుతోందిప్పుడు. కాస్త ప్రోత్సహించి, పెట్టుబడి పెడితే... ఆ కంపెనీల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే... ఇపుడు ఇండియా అంటే స్టార్టప్‌ల రాజధాని. ఇండియాకు ఈ హోదా ఇచ్చిన 2015... వచ్చే ఏడాది పరిణామాలను ముందే కళ్లకు కడుతోంది. ఆ కథల సమాహారమే ఈ రౌండప్!

 
బిలియన్ డాలర్ల స్టార్టప్‌లు11 మన దేశంలోనే

* ఈ ఏడాది 764 కంపెనీల్లోకి రూ.55 వేల కోట్ల పెట్టుబడులు
* మహిళల వాటా 24 శాతం; వారికోసం ప్రత్యేక ఫండ్
* 20కి పైగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన రతన్ టాటా
* 2016లో ఈ-కామర్స్ మినహా ఇతర రంగాల హవా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిలియన్ డాలర్ల క్లబ్!! టర్నోవర్ పరంగా కావచ్చు... విలువ పరంగా కావచ్చు... ఈ క్లబ్‌లో చేరటమనేది కంపెనీల కల.

సంప్రదాయ పరిశ్రమలు కొన్ని దశాబ్దాల పాటు శ్రమించి ఈ హోదా పొందితే... స్టార్టప్‌లు రెండు మూడేళ్లలోనే ఆ విలువను దాటేస్తున్నాయి. అదీ స్టార్టప్‌ల సత్తా. ఈ ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల విలువ దాటిన స్టార్టప్‌లు 68 వరకూ ఉండగా... వాటిలో 16 శాతం... అంటే 11 సంస్థలు ఇండియాలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 30 వేల నుంచి 35వేల వరకూ స్టార్టప్ కంపెనీలుండగా వీటిలో 3,000 వరకు భారీ పెట్టుబడులతో స్థిరపడ్డాయి.

2014లో మొత్తం 3,314 స్టార్టప్‌లు రాగా వాటిలో కేవలం 263 కంపెనీలకే పెట్టుబడులు వచ్చాయి. అప్పట్లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులు రాగా... వీటిలో ఫ్లిప్‌కార్ట్ వంటి భారీ పెట్టుబడులూ ఉన్నాయి. ఈ ఏడాదిలో మాత్రం 3,931 స్టార్టప్ కంపెనీల్లో... 764 సంస్థల్లోకి దాదాపు 55 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మరో 1000 కంపెనీలు నిధుల సమీకరణలో ఉన్నాయని, వచ్చే ఏడాది ఆ ప్రక్రియ పూర్తి కావచ్చని లెమన్ ఐడియాస్ ఇన్నోవేషన్ సంస్థ చీఫ్ ఐడియా ఫార్మర్ దీపక్ మొనారియా తెలియజేశారు.
 
ఈ-కామర్స్ నుంచి ఇతర రంగాలకు...
ఈ ఏడాది వచ్చిన స్టార్టప్స్‌లో అధికభాగం ఈ కామర్స్‌వే. 25-30 శాతం ఈ విభాగానివే కాగా... సర్వీసుల రంగంలో 22 శాతం, టెక్నాలజీ విభాగంలో 20 శాతం, విద్యా రంగంలో 18 శాతం, వైద్య రంగంలో 10-15 శాతం సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2016లో మాత్రం ఈ-కామర్స్ కాకుండా కొత్త రంగాల్లో స్టార్టప్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు లీడ్ ఏంజిల్స్ నెట్‌వర్క్ దక్షిణాది వైస్ ప్రెసిడెంట్ వినుత రాళ్లపల్లి చెప్పారు. ‘‘ఇప్పటికే ఈ-కామర్స్‌లో పెద్ద కంపెనీలు పాతుకుపోయాయి.

విలువ విషయంలోనూ దిద్దుబాటు జరుగుతోంది. దీంతో వ్యవసాయం, ఆహారం, విద్యా, వైద్య రంగాల్లో పెద్ద సంఖ్యలో స్టార్టప్స్ వస్తున్నాయి’’ అని ఆమె వివరించారు. ఈ ఏడాది ఆన్‌లైన్ రిటైల్  రంగంలో 431 స్టార్టప్స్ వస్తే, విద్యా రంగంలో 385, వైద్య రంగంలో 237, ఆహార రంగంలో 351 కంపెనీలొచ్చాయి. ‘‘ఏ రంగమైనా, ఏ కంపెనీ అయినా! పెట్టుబడి పెట్టడానికి సంస్థ పనితీరు, ప్రమాణాలే గీటురాయి కావాలి’’ అన్నారామె.
 
చుక్కలు చూసిన స్టార్టప్స్ కూడా...
ఆరంభంలో ఆకాశాన్ని తాకి.. కొద్ది కాలానికే నేలకొరిగిన స్టార్టప్స్ ఈ ఏడాదిలోనూ వచ్చాయి. జొమాటో, టైనీ ఔల్, హౌజింగ్.కామ్ లాంటివి ఇందుకు ఉదాహరణ. ఇవి కొన్ని నగరాల్లో కార్యకలాపాలను నిలిపేశాయి కూడా. జొమాటో 300 మందిని, టైనీ ఔల్ 200 మందిని, హౌజింగ్.కామ్ అయితే ఏకంగా 800 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. స్టాక్ మార్కెట్లో స్టార్టప్‌ల లిస్టింగ్‌కు వీలుగా సెబీ కొన్ని నిబంధనలు సడలించినప్పటికీ ఈ ఏడాది ఒక్కటీ లిస్ట్ కాలేదు. ఇన్ఫీబీమ్, మాట్రిమోనీ వంటి కంపెనీలు మాత్రం పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేశాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇవి లిస్టయ్యే అవకాశముంది.
 
వ్యక్తిగతంగా... గ్రూప్‌లుగా పెట్టుబడులు
స్టార్టప్‌ల విషయానికొచ్చేసరికి పెట్టుబడుల తీరు మారుతోంది. 2014 నుంచి స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతున్న రతన్ టాటా... ఈ ఏడాది హోలా షెఫ్, అర్బన్ ల్యాడర్, కార్‌దేఖో, స్నాప్‌డీల్, బ్లూస్టోన్, ఓలా క్యాబ్స్ వంటి 20కి పైగా స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టారు. ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ రాజన్ ఆనందన్ 29 కంపెనీల్లో, సునిల్ కర్లా 16, అనుపమ్ మిట్టల్ 15, రాజేష్ సాహ్ని 13, అరిహంత్ పట్ని 12, కునాల్ బహల్ 12, రోహిత్ కుమార్ బన్సాల్ 12 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.
   
గ్రూప్ పెట్టుబడుల విషయానికొస్తే.. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్‌ఆర్ నారాయణమూర్తి సొంతంగా వెంచర్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రేమ్ జీ కొడుకు రిషద్ సారథ్యంలో ‘ప్రేమ్ జీ ఇన్వెస్ట్’ పేరిట మిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేశారు. ‘కాటమరాన్ వెంచర్స్’ పేరుతో నారాయణమూర్తి కూడా భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు. రూ.100 కోట్ల నిధితో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వెంచర్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు.
   
హైదరాబాద్‌కు చెందిన టాలెంట్ స్ప్రింట్ చైర్మన్ జేఏ చౌదరి, కొందరు పారిశ్రామికవేత్తలు కలిసి రూ.30 కోట్లతో స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఏంజెల్స్‌లో బీవీఆర్ మోహన్‌రెడ్డి, జేఏ చౌదరి, శ్రీని కొప్పోలు, వంటి ఐటీ నిపుణులతో పాటుగా డీ సురేష్ బాబు, హరీష్ చంద్ర ప్రసాద్, శ్రీనిరాజు వంటి సుమారు 65 మంది ప్రముఖులూ సభ్యులుగా ఉన్నారు. పారిశ్రామికవేత్తలు బీవీఆర్ మోహన్‌రెడ్డి, జేఏ చౌదరి, శ్రీని కొప్పోలు, హరీష్‌చంద్ర ప్రసాద్, శ్రీనిరాజుతో సహా సినీ ప్రముఖుడు డి.సురేష్‌బాబు వంటి 65 మంది కలసి ‘హైదరాబాద్ ఏంజెల్స్’ను ఏర్పాటు చేశారు. 2012లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకు 12 సంస్థల్లో రూ.15 కోట్ల పెట్టుబడి పెట్టింది.
   
స్టార్టప్‌లలో మహిళలూ ముందుంటున్నారు. దేశీ స్టార్టప్స్‌లో 25 శాతం మహిళలవేనని, ఇది 2011లో 15 శాతం మాత్రమేనని ‘స్టార్టప్ మస్టర్-2015’ నివేదిక పేర్కొంది. మహిళ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దేశంలో తొలిసారిగా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటైంది కూడా ఈ ఏడాదే. సాహా ఫండ్ పేరిట రూ.100 కోట్ల నిధితో కొందరు పారిశ్రామికవేత్తలు జట్టుకట్టారు. ఇందులో యాక్సెంచర్ ఇండియా మాజీ సీఎండీ అంకితా వశిష్ట, ఆమె తండ్రి అవినాష్ వశిష్ట, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టీవీ మోహన్ దాస్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షాలు సభ్యులు.
 
2015లో టాప్ విలీనాలు, కొనుగోళ్లు..
200 మిలియన్ డాలర్లతో టాక్సీఫర్‌ష్యూర్‌ను ఓలా కొనుగోలు చేసింది
ఫ్రీచార్జ్‌ను 400 మిలియన్ డాలర్లతో స్నాప్‌డీల్ కైవసం చేసుకుంది
కార్‌ట్రేడ్ సంస్థ 90 మిలియన్ డాలర్లతో కార్‌వాలాను కొనుగోలు చేసింది

 
హైదరాబాద్ హవా..
దేశానికి ఐటీ రాజధాని లాంటి హైదరాబాద్... స్టార్టప్‌లకూ హబ్‌గా మారింది. బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాలు స్టార్టప్‌లకు స్వర్గధామంగా నిలుస్తుండగా.. ఆ రెండింటికన్నా కూడా హైదరాబాద్ చాలా విషయాల్లో ముందుంది. ‘‘వ్యయం పరంగానే కాక నిపుణులు, మౌలిక సదుపాయాల పరంగానూ స్టార్టప్‌లకు హైదరాబాదే సానుకూలం’’ అని సాక్షాత్తూ రతన్ టాటాయే చెప్పారుకూడా. సోమవారం టీ-హబ్‌ను సందర్శించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాట కూడా ఇదే.

ఈ మాటలు నిజం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా అధునాతన సౌకర్యాలతో స్టార్టప్స్ కోసం టీ-హబ్‌ను నిర్మించింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ-హైదరాబాద్), బిట్స్ పిలానీ, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా), ద ఇండస్ ఎంటర్‌ప్రైజెస్ (టై), హైదరాబాద్ ఏంజిల్స్, స్పార్క్ 10.. వంటివి ఇక్కడి స్టార్టప్‌లకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి కూడా.
 
‘సాక్షి స్టార్టప్ డైరీ’ భాగస్వామే..
స్టార్టప్ డైరీ ద్వారా సాక్షి ఇప్పటిదాకా 46 కంపెనీల సమాచారాన్ని అందించింది. ఇందులో విద్య, వైద్యం, షాపింగ్, మొబైల్స్... ఇలా అన్ని రంగాలవీ ఉన్నాయి. వీటితో పాటు స్టార్టప్‌లకు నిధులందిస్తున్న నె ట్‌వర్క్‌ల సమాచారాన్నీ అందించింది. ప్రచారానికి పెద్దగా ఖర్చుపెట్టలేని తమ స్టార్టప్‌కు ‘సాక్షి’ అండతో క్లయింట్లు పెరిగారని కొందరు, నిధుల సమీకరణకు ఉపకరించిందని కొందరు... ఇలా పెద్ద సంఖ్యలో వచ్చిన ఈ-మెయిళ్లే స్టార్టప్ డైరీకి తదుపరి ఇంధనం.

స్టార్టప్ బూమ్‌తో జరిగిన మరో మేలేంటంటే ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన యువత స్వదేశానికి తిరిగిరావటం. మరీ ముఖ్యంగా హైద రాబాదీ యువత. హలోకర్రీ వ్యవస్థాకుల్లో ఒకరైన రాజు భూపతి... డుకెర్ టెక్నాలజీస్‌ను(లే చల్) ఏర్పాటు చేసిన క్రిస్పి లారెన్స్... ఈ-కిన్‌కేర్ వ్యవస్థాపకుడు కిరణ్ కలకుంట్ల, క్రియా లెర్నింగ్ అధిపతి  హరివర్మ... అంతా ఈ కోవలోని వారే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement