సంచార పశువైద్యశాలలు ప్రారంభం
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంపద పరిరక్షణకు ఉద్దేశించిన సంచాల పశు వైద్యశాలలను జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వాహనాన్ని కలెక్టరేట్ ఆవరణలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, ఆదోనిలకు ప్రభుత్వం సంచార పశువైద్యశాలలను మంజూరు చేసిందన్నారు. ఇందుకు ప్రత్యేకంగా వాహనం, డాక్టరు, ఒక పారా సిబ్బంది ఉండి పశుసంపదకు సేవలు అందిస్తారని తెలిపారు. పశువైద్యశాలలు లేని గ్రామాలకు వెళ్లి పశువులకు వైద్య సేవలు అందిస్తారన్నారు. వీటిని స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు సంచార పశువైద్యాశాలలను సొసైటీ ఫర్ రూరల్ అండ్ ఏకో డెవలప్మెంటు సొసైటీకి, మరో రెండు అంకుష్ సంస్థకు ప్రభుత్వం అప్పగించిందన్నారు. వీటిపై ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 75 లక్షలు ఖర్చు చేస్తే, స్వచ్చంద సంస్థలు రూ.25 లక్షలు ఖర్చు చేస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పశుసంపదకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ సుదర్శన్కుమార్, ఏడీ విజయుడు, పశువైద్యాధికారి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. æ