ముగిసిన ఆటో ఎక్స్పో
గ్రేటర్ నోయిడా: నగరంలో వారం క్రితం ప్రారంభమైన 12వ ఆటోఎక్స్‌పో మంగళవారం ముగిసింది. ఈ షో కార్ల పరిశ్రమకు మళ్లీ మంచిరోజులు వస్తాయని, విక్రయాలు బాగా పెరుగుతాయని ఆశలు క్రమేపీ చిగురిస్తున్నాయి. కాగా ఈ షోలో మొత్తం ఆవిష్కరణలు చోటుచేసుకోగా, అందులో 26 అంతర్జాతీయ మోడల్ కార్లు ఉన్నాయి. మొత్తం 5.6 లక్షలమంది సందర్శకులు ఈ షోను తిలకించారు. చివరిరోజైన మంగళవారం దాదాపు 90 వేలమంది సందర్శకులు తరలివచ్చారు. కాగా 11వ ఆటో ఎక్స్పో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన సంగతి విదితమే. ఈ విషయమై మారుతి సుజికీ ఇండియా సంస్థ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మనోహర్ భట్ మాట్లాడుతూ గత 11వ ఆటో ఎక్స్పో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన షోని మొత్తం ఏడు లక్షలమంది సందర్శించారన్నారు. విక్రయాలు తగ్గుముఖం పడుతున్న సమయంలోనే ఈ షో జరిగిందన్నారు. ఇదొక సానుకూల సంకేతమన్నారు. సందర్శకు నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇదే విషయమై సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) డిప్యూటీ జనరల్ మాట్లాడుతూ సందర్శకులనుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇదిలాఉంచితే జర్మనీకి చెందిన విలాసవంతమైన బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ కార్ల వద్ద సోమవారం సందర్శకులు అత్యధిక సంఖ్యలో కనిపించిన సంగతి విదితమే. దాదాపు 50 మీటర్ల మేర క్యూలలో సందర్శకులు నిల్చుని వాహనాలను సందర్శించారు.