model villages
-
సారీ.. సారా
వెంకటనగరం వంటి ఆదర్శ గ్రామాలెన్నో.. ప్రభుత్వ యంత్రాంగం కృషితో రాజమండ్రి సమీపంలోని వెంకటనగరం గ్రామం పూర్తి సారా రహిత గ్రామంగా మారింది. ఈ గ్రామం ఒకప్పుడు నాటుసారాకు అడ్డాగా ఉండేది. 741 కుటుంబాలున్న ఆ గ్రామంలో 55 కుటుంబాలు నాటుసారా తయారీనే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయి. 30 ఏళ్లకు పైగా సారా తయారీ, విక్రయాలు చేసిన వీరిలో మూడున్నరేళ్లుగా మార్పు మొదలైంది. ఎస్ఈబీ పరివర్తన–2 కార్యక్రమంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తోడుకావడంతో గతేడాది ఏప్రిల్ నుంచి సారా రహిత గ్రామంగా మార్పుచెందింది. నిజానికి.. రాష్ట్రంలో నాటుసారా స్థావరాలకు తూర్పుగోదావరి జిల్లా పెట్టింది పేరు. గోకవరం, రాజానగరం, గండేపల్లి, కాతేరు, రామవరం, శాటిలైట్ సిటీ, కోరుకొండ, సీతానగరం వంటి 240 గ్రామాల్లో నాటుసారా ఏరులై పారేది. దీని నియంత్రణకు ప్రభుత్వం ‘పరివర్తన 2.0’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలుచేసింది. దీంతో పది గ్రామాలు మినహా 230 గ్రామాలు ఇప్పుడు సారాకు టాటా చెప్పి సంక్షేమబాట పట్టాయి. ప్రభుత్వ తోడ్పాటుతో స్వయం ఉపాధి మరోవైపు.. సామాజిక రుగ్మతగా మారిన సారాపై ప్రభుత్వం సంధించిన సంక్షేమాస్త్రం మంచి ఫలితాలిస్తోంది. మూడు దశాబ్దాల పూర్వం నుంచి ‘తూర్పు’న సాగిన సారా ప్రవాహానికి మూడున్నరేళ్లలో అడ్డుకట్ట పడటంతో ఆ గ్రామాల్లో గణనీయమైన మార్పు కన్పిస్తోంది. సారా మహమ్మారి నుంచి బయటపడిన అనేక కుటుంబాల స్వయం ఉపాధికి ప్రభు త్వం ఊతమిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ‘నవరత్నాలు’ ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో అందుతున్నాయి. దీనికితోడు డీఆర్డీఏ, మెప్మా, పరిశ్రమల శాఖలు కూడా అనేక కార్యక్రమాల ద్వారా వారిని ఆదుకుంటున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పలు శాఖలను సమన్వయంతో వారి జీవనోపాధికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 128 కుటుంబాలకు రూ.1.47 కోట్ల సబ్సిడీ రుణాలు అందించారు. ఫలితంగా.. వారు గేదెలు, కోళ్ల పెంపకం, కిరాణా, పాన్‌షాప్, హోటల్ వంటి వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పరిశ్రమల శాఖ ద్వారా చిన్న తరహా యూనిట్ల ఏర్పాటు నిమిత్తం 27 మంది లబ్ధిదారులకు రూ.1.01కోట్లు మంజూరు చేశారు. వారంతా పేపర్ప్లేట్లు, అప్పడాల తయారీ, ఎంబ్రాయిడరీ వర్క్, సెంట్రింగ్ వర్క్, టెంట్‌హౌస్, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో స్వీటు కొట్టు పెట్టుకున్నా.. ప్రభుత్వం నాకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఆ డబ్బుతో స్వీటు కొట్టు పెట్టుకుని పూతరేకులు విక్రయిస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాను. నా భార్య ప్రమోదకు ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ ఇస్తోంది. అమ్మఒడి కూడా వస్తోంది. నన్ను ఆర్థికంగా ఆదుకుని నా కుటుంబానికి భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ మేలు ఎప్పటికీ మరిచిపోం. – పల్లి అంబేడ్కర్, మద్దూరులంక గ్రామం కొంతమూరుకు చెందిన సాలా జోగమ్మ కుటుంబం పదేళ్లకు పైగా సారా తయారీ, విక్రయాలపైనే ఆధారపడి బతికేది. ఆమె పెద్ద కొడుకు బలరామ్‌పై ఏడు కేసులు, చిన్న కొడుకు వెంకన్నపై నాలుగు కేసులు ఉండేవి. సారా తయారీపై వచ్చిన డబ్బులు కేసులు, బెయిల్ ఖర్చులకే సరిపోయేవి. చివరకు ఆ కుటుంబం అప్పులపాలైంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారుల కౌన్సెలింగ్‌లో సారాకు స్వస్తిపలికి చిన్నబడ్డీ పెట్టుకుని జోగమ్మ జీవిస్తోంది. భర్త శ్రీను, కొడుకు బలరామ్లు పందుల పెంపకంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారిపై ఉన్న సారా కేసులను ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నారు. డ్వాక్రా ద్వారా సాయం అందింది. సారా విక్రయాలు ఆపేసిన తనకు బతుకుదెరువు కోసం అధికారులు రూ.3 లక్షల సాయం అందించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు జోగమ్మ చెప్పింది. కవలగొయ్యికి చెందిన తీగిరెడ్డి శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి సారా విక్రయించేవాడు. చదువుకు స్వస్తిచెప్పి సారా తయారీనే ఉపాధిగా ఎంచుకున్నాడు. అతనిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఎన్నిసార్లు పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పులేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సారాపై ప్రధాన దృష్టిసారించి ‘పరివర్తన’ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో సారా తయారీ, విక్రయాలకు శ్రీనివాస్ స్వస్తి పలికాడు. ప్రభుత్వం అందించిన రూ.50వేల సాయంతో టిఫిన్ బండి పెట్టుకుని గౌరవంగా జీవిస్తున్నాడు. అతని భార్య గంగాభవానీకి ప్రభుత్వం రూ.5 లక్షలు (రూ.1.50లక్షలు సబ్సిడీ) లోను ఇవ్వడంతో టైలరింగ్ చేసుకుంటోంది. అంతేకాదు.. డ్వాక్రాలో ఉన్న ఆమెకు ఏటా రూ.10వేలు ప్రభుత్వ సాయంతోపాటు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున అందుకుంటోంది. వీరి కుమారులకు జగనన్న విద్యా దీవెన, విద్యా కానుకలు మూడేళ్లుగా అందుతున్నాయి. ఇలా.. సర్కారు అందిస్తున్న సంక్షేమంతో శ్రీనివాస్ సారాకు సారీ చెప్పేశాడు. వీరే కాదు.. వెంకటనగరం గ్రామానికి చెందిన గుమ్మడి నాగరాజు (నాని) పది గేదెలను పెంచుతూ పాలవ్యాపారం చేస్తున్నాడు.. ♦ అదే గ్రామానికి చెందిన మగ్గం రాంబాబు తాపీ పనికి, వెళ్తున్నాడు.. ♦ రాజమండ్రి రాజీవ్ గృహకల్ప శాటిలైట్ సిటీకి చెందిన మార్గాని వీర్రాజు హోటల్ నిర్వహించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ♦ శాటిలైట్ సిటీ ‘బీ–బ్లాక్’కు చెందిన బచ్చు అంజిబాబు కిరాణా, కిళ్లీ షాపుతోపాటు కోళ్ల పెంపకం చేపట్టి స్వయం ఉపాధి పొందుతున్నాడు.. ♦ లాలా చెరువు కాలనీకి చెందిన గరుగుమిల్లి శ్రీనివాసరావు రెండు గేదెలు, ఆవులు, 40 కోళ్లను పెంచుతూ నెలకు దాదాపు రూ.40వేలు సంపాదిస్తున్నాడు.. ♦ రాజీవ్ గృహకల్ప నివాసి పసల సూర్యచంద్రరావు పాన్‌షాపు నిర్వహిస్తూ గౌరవంగా జీవిస్తున్నాడు. ♦ ఇలా అనేకమంది నాటుసారా విష వలయం నుంచి బయటకొచ్చి స్వయం ఉపాధితో ఆనందంగా జీవిస్తున్నారు. - తూర్పుగోదావరి నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు -
పల్లెకు పట్టం కడదాం!
చట్టసభ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ‘సాంసద్ ఆదర్శ గ్రామ యోజన’ పథకం ప్రారంభం సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఓ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించారు. పేరు ‘సాంసద్ ఆదర్శ గ్రామ యోజన’(ఎస్ఏజీవై). జయప్రకాశ్ నారాయణ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఈ పథకాన్ని ప్రారంభించి ఆయన ప్రసంగించారు. దేశంలో 800 మంది దాకా ఉన్న ఎంపీల్లో ప్రతి ఒక్కరూ మూడు గ్రామాలను దత్తత తీసుకొని, ఈ పథకం కింద 2019కల్లా ఆ గ్రామాల్లో భౌతికమైన, సంస్థాగతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీ నమూనా గ్రామ పథకంగా పిలిచే ఈ పథకాన్ని మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఎంపీ ఏ గ్రామాన్నయినా దత్తత తీసుకోవచ్చు. అయితే అది తన స్వగ్రామంగాని, అత్తమామల గ్రామంగాని కాకూడదని మోదీ షరతు పెట్టారు. తాను తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో తాను ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. వరంగల్ గ్రామానికి మోదీ ప్రశంసలు.. వరంగల్ జిల్లాలోని గంగాదేవిపల్లిని మోదీ ఆదర్శ గ్రామంగా ప్రశంసించారు. చిన్న గ్రామంలో అభివృద్ధికి ఏర్పాటు చేసిన 28 కమిటీలు ఇప్పటికీ పనిచేస్తున్నాయన్నారు. అలాంటి ఆదర్శగ్రామాలను స్ఫూర్తిగా తీసుకుని ఎంపీ, ఎమ్మెల్యేలు ముందుకు వస్తే ఏడెనిమిది వేల గ్రామాలను అభివృద్ధి చేయవచ్చని, తద్వారా గ్రామీణాభివృద్ధి నమూనాను మార్చవచ్చన్నారు. ఎమ్మెల్యేలకూ ఈ పథకం పెట్టాలి.. ఎంపీల్లో ప్రతి ఒక్కరూ మూడేసి గ్రామాలను ఎంపిక చేసుకుంటే.. 2019కల్లా 2500 గ్రామాలు అభివృద్ధి బాట పడతాయని మోదీ అన్నారు. మొదటి గ్రామం 2016కల్లా అభివృద్ధి చెందుతుందని, దీని అనుభవంతో మిగతా రెండు గ్రామాలనూ 2019కల్లా అభివృద్ధి చేయగలమని భావిస్తున్నట్లు వివరించారు. తర్వాత ప్రతి ఏటా ఒక గ్రామం అభివృద్ధి చేయొచ్చన్నారు. ‘‘మనకు దాదాపు 800 మంది ఎంపీలున్నారు. 2019కంటే ముందు ప్రతి ఒక్కరూ మూడేసి గ్రామాలను అభివృద్ధి చేస్తే. మనం దాదాపు 2500 గ్రామాలను పూర్తి చేయగలం. ఇదే పంథాలో రాష్ట్రాలు కూడా ఎమ్మెల్యేల ద్వారా పథకం ఏర్పాటు చేస్తే.. అపుడు మరో 6 నుంచి 7 వేల గ్రామాలను అభివృద్ధి చేసే అవకాశముంటుంది’’ అని చెప్పారు. ఓ జిల్లాలో ఒక్క గ్రామం అభివృద్ధి చెందినా.. దాని స్ఫూర్తితో మిగతా గ్రామాలూ వృద్ధి చెందుతాయన్నారు. ఈ పథకం అమలు పరిశీలనకు రియల్ టైమ్ వెబ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హఠాత్తుగా మార్పు తెస్తాననలేదు ఇంతవరకు సరఫరా ఆధారిత విధానంలో గ్రామాలు అభివృద్ధి చేశారని, ఈ పథకం కింద డిమాండ్ ఆధారంగా గ్రామాల అభివృద్ధి చేయాలని నిర్ణయించామని మోదీ చెప్పారు. తమ గ్రామం గురించి ప్రతి ఒక్కరూ గర్వపడే రోజు వస్తుందన్నారు. ‘‘మేం పని చేయాలనుకుంటున్నాం. ప్రజల భాగస్వామ్యంతో మార్పు తీసుకురాగలమేమో చూడాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితిని హఠాత్తుగా మార్చేస్తానని నేనేమీ చెప్పడం లేదు. ఈ పథకమే అంతిమం కాదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ అన్ని ప్రభుత్వాలూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ స్థాయిలో కృషి చేశాయి. అయితే కాలంతోపాటే మార్పులు, అభివృద్ధి జరగాలి. ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగాలి’’ అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా కృషి .. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి బాధ్యత తీసుకోవాలని అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓట్లతో సంబంధం లేకుండా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా గ్రామాభివృద్ధి కోసం సదుపాయాలు కల్పించే వ్యక్తిగా పనిచేయాలని ఎంపీలను కోరారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ నారాయణ్, మహాత్మా గాంధీలను ఆయన ఉదహరించారు. గ్రామాల్లో ప్రముఖుల శుభకార్యాల సందర్భంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో ఆహారపదార్థాలు పంపిణీ చేయించాలని, తద్వారా మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెరగడానికి ఇది దోహదం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా ఆదర్శగ్రామ పథకం విశేషాలను, గ్రామాల అభివృద్ధికి చేయాతనివ్వాల్సిన అంశాలను వివరిస్తూ మాట్లాడారు. ‘‘దేశంలోని 400లకు పైగా జిల్లాల్లో 5వేల గ్రామాల్లో నేను పర్యటించాను. గ్రామాల పరిస్థితిపై నా స్వీయ అనుభంతో చెపుతున్నా. ఈ గ్రామాలను ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయగలమని అర్థమైంది. ఇది డబ్బుపై ఆధారపడి నడిచే పథకం కాదు. ప్రజలపై ఆధారపడి నడిచేది. ప్రజల భాగస్వామ్యంతో ఇది మరింత పరుగులు పెడుతుంది’’. ‘‘దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలున్నాయి. అయితే ప్రతి రాష్ట్రంలో కొన్ని గ్రామాలు మాత్రమే ఆ రాష్ట్రం గర్వపడేలా ఉన్నాయి. అంటే అక్కడ నాయకత్వం, ప్రజలు ప్రభుత్వ పథకాల కంటేఅదనంగా చేసింది ఏదో ఉంది. ఈ అదనంగా ఉన్నదే.. ఈ సాంసద్ ఆదర్శ గ్రామ యోజనకు స్ఫూర్తి.’’ - నరేంద్ర మోదీ ఆదర్శగ్రామం ‘గంగాదేవిపల్లి’పై లఘుచిత్ర ప్రదర్శన ఆదర్శగ్రామ యోజన ఆవిష్కరణ సందర్భంగా దేశంలోని ఆదర్శగ్రామాలపై లఘుచిత్రాలను ప్రదర్శించారు. అన్నింటికన్నా ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగాదేవిపల్లి ఆదర్శగ్రామాన్ని ప్రదర్శించారు. ప్రజల భాగస్వామ్యం, సుపరిపాలన, సమర్థనేతృత్వం వెరసి ఆదర్శగ్రామం లక్ష్యాన్ని సిద్ధించింది. వందశాతం పారిశుద్ధ్యం, తాగునీటి కల్పన, విద్య, పక్కారోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, పొదుపు సంఘాల పనితీరు, ఇతర అభివృద్ధి పనుల ద్వారా ఆదర్శ గ్రామంగా నిలిచి సభికుల ప్రశంసలను అందుకుంది. కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్, గ్రామ సర్పంచ్ ఇట్ల శాంతి, ఉప సర్పంచ్, గ్రామ అభివృద్ధి శాఖ కమిటీ అధ్యక్షుడు కె.రాజమౌళి హాజరయ్యారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆదర్శగ్రామ యోజన ఆవిష్కరణ సభలో గంగాదేవిపల్లి గ్రామాన్ని ప్రదర్శించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గ్రామాన్ని మరింత ఉన్నతంగా తీర్చదిద్దడానికి కృషిచేస్తామని చెప్పారు.