సారీ.. సారా | The survivors are recovering with the help of the government | Sakshi
Sakshi News home page

సారీ.. సారా

May 29 2023 4:51 AM | Updated on May 29 2023 6:57 AM

The survivors are recovering with the help of the government - Sakshi

వెంకటనగరం వంటి ఆదర్శ గ్రామాలెన్నో.. 
ప్రభుత్వ యంత్రాంగం కృషితో రాజమండ్రి సమీపంలోని వెంకటనగరం గ్రామం పూర్తి సారా రహిత గ్రామంగా మారింది. ఈ గ్రామం ఒకప్పుడు నాటుసారాకు అడ్డాగా ఉండేది. 741 కుటుంబాలున్న ఆ గ్రామంలో 55 కుటుంబాలు నాటుసారా తయారీనే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయి. 30 ఏళ్లకు పైగా సారా తయారీ, విక్రయాలు చేసిన వీరిలో మూడున్నరేళ్లుగా మార్పు మొదలైంది. ఎస్‌ఈబీ పరివర్తన–2 కార్యక్రమంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తోడుకావడంతో గతేడాది ఏప్రిల్‌ నుంచి సారా రహిత గ్రామంగా మార్పుచెందింది.

నిజానికి.. రాష్ట్రంలో నాటుసారా స్థావరాలకు తూర్పుగోదావరి జిల్లా పెట్టింది పేరు. గోకవరం, రాజానగరం, గండేపల్లి, కాతేరు, రామవరం, శాటిలైట్‌ సిటీ, కోరుకొండ, సీతానగరం వంటి 240 గ్రామాల్లో నాటుసారా ఏరులై పారేది. దీని నియంత్రణకు ప్రభుత్వం ‘పరివర్తన 2.0’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలుచేసింది. దీంతో పది గ్రామాలు మినహా 230 గ్రామాలు ఇప్పుడు సారాకు టాటా చెప్పి సంక్షేమబాట పట్టాయి.

ప్రభుత్వ తోడ్పాటుతో స్వయం ఉపాధి 
మరోవైపు.. సామాజిక రుగ్మతగా మారిన సారాపై ప్రభుత్వం సంధించిన సంక్షేమాస్త్రం మంచి ఫలితాలిస్తోంది. మూడు దశాబ్దాల పూర్వం నుంచి ‘తూర్పు’న సాగిన సారా ప్రవాహానికి మూడున్నరేళ్లలో అడ్డుకట్ట పడటంతో ఆ గ్రామాల్లో గణనీయమైన మార్పు కన్పిస్తోంది. సారా మహమ్మారి నుంచి బయటపడిన అనేక కుటుంబాల స్వయం ఉపాధికి ప్రభు త్వం ఊతమిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ‘నవరత్నాలు’ ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో అందుతున్నాయి.

దీనికితోడు డీఆర్‌డీఏ, మెప్మా, పరిశ్రమల శాఖలు కూడా అనేక కార్యక్రమాల ద్వారా వారిని ఆదుకుంటున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మాధవీలత పలు శాఖలను సమన్వయంతో వారి జీవనోపాధికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 128 కుటుంబాలకు రూ.1.47 కోట్ల సబ్సిడీ రుణాలు అందించారు. ఫలితంగా.. వారు గేదెలు, కోళ్ల పెంపకం, కిరాణా, పాన్‌షాప్, హోటల్‌ వంటి వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

పరిశ్రమల శాఖ ద్వారా చిన్న తరహా యూనిట్ల ఏర్పాటు నిమిత్తం 27 మంది లబ్ధిదారులకు రూ.1.01కోట్లు మంజూరు చేశారు. వారంతా పేపర్‌ప్లేట్లు, అప్పడాల తయారీ, ఎంబ్రాయిడరీ వర్క్, సెంట్రింగ్‌ వర్క్, టెంట్‌హౌస్, జీడిపప్పు ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేసుకున్నారు.  

ప్రభుత్వ సహకారంతో  స్వీటు కొట్టు పెట్టుకున్నా.. 
ప్రభుత్వం నాకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఆ డబ్బుతో స్వీటు కొట్టు పెట్టుకుని పూతరేకులు విక్రయిస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాను. నా భార్య ప్రమోదకు ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ ఇస్తోంది. అమ్మఒడి కూడా వస్తోంది. నన్ను ఆర్థికంగా ఆదుకుని నా కుటుంబానికి భరోసా ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ మేలు ఎప్పటికీ మరిచిపోం.   – పల్లి అంబేడ్కర్, మద్దూరులంక గ్రామం 

కొంతమూరుకు చెందిన సాలా జోగమ్మ కుటుంబం పదేళ్లకు పైగా సారా తయారీ, విక్రయాలపైనే ఆధారపడి బతికేది. ఆమె పెద్ద కొడుకు బలరామ్‌పై ఏడు కేసులు, చిన్న కొడుకు వెంకన్నపై నాలుగు కేసులు ఉండేవి. సారా తయారీపై వచ్చిన డబ్బులు కేసులు, బెయిల్‌ ఖర్చులకే సరిపోయేవి. చివరకు ఆ కుటుంబం అప్పులపాలైంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారుల కౌన్సెలింగ్‌లో సారాకు స్వస్తిపలికి చిన్నబడ్డీ పెట్టుకుని జోగమ్మ జీవిస్తోంది.

భర్త శ్రీను, కొడుకు బలరామ్‌లు పందుల పెంపకంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారిపై ఉన్న సారా కేసులను ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నారు. డ్వాక్రా ద్వారా సాయం అందింది. సారా విక్రయాలు ఆపేసిన తనకు బతుకుదెరువు కోసం అధికారులు రూ.3 లక్షల సాయం అందించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు జోగమ్మ చెప్పింది. 

కవలగొయ్యికి చెందిన తీగిరెడ్డి శ్రీనివాస్‌ చిన్నప్పటి నుంచి సారా విక్రయించేవాడు. చదువుకు స్వస్తి­చెప్పి సారా తయారీనే ఉపాధిగా ఎంచుకున్నాడు. అతనిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఎన్నిసార్లు పట్టుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చినా మార్పులేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక సారాపై ప్రధాన దృష్టిసారించి ‘పరివర్తన’ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో సారా తయారీ, విక్రయాలకు శ్రీనివాస్‌ స్వస్తి పలికాడు.

ప్రభుత్వం అందించిన రూ.50వేల సాయంతో టిఫిన్‌ బండి పెట్టు­కుని గౌరవంగా జీవిస్తున్నాడు. అతని భార్య గంగాభవానీకి ప్రభుత్వం రూ.5 లక్షలు (రూ.1.50­­లక్షలు సబ్సిడీ) లోను ఇవ్వడంతో టైలరింగ్‌ చేసుకుంటోంది. అంతేకాదు.. డ్వాక్రాలో ఉన్న ఆమెకు ఏటా రూ.10వేలు ప్రభుత్వ సాయంతోపాటు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున అందుకుంటోంది. వీరి కుమారులకు జగనన్న విద్యా దీవెన, విద్యా కానుకలు మూడేళ్లుగా అందుతున్నాయి. ఇలా.. సర్కారు అందిస్తున్న సంక్షేమంతో శ్రీనివాస్‌ సారాకు సారీ చెప్పేశాడు.

వీరే కాదు.. వెంకటనగరం గ్రామానికి చెందిన గుమ్మడి నాగరాజు (నాని) పది గేదెలను పెంచుతూ పాలవ్యాపారం చేస్తున్నాడు..  
అదే గ్రామానికి చెందిన మగ్గం రాంబాబు తాపీ పనికి, వెళ్తున్నాడు..  
రాజమండ్రి రాజీవ్‌ గృహకల్ప శాటిలైట్‌ సిటీకి చెందిన మార్గాని వీర్రాజు హోటల్‌ నిర్వహించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు..  
శాటిలైట్‌ సిటీ ‘బీ–బ్లాక్‌’కు చెందిన బచ్చు అంజిబాబు కిరాణా, కిళ్లీ షాపుతోపాటు కోళ్ల పెంపకం చేపట్టి స్వయం ఉపాధి పొందుతున్నాడు..  
లాలా చెరువు కాలనీకి చెందిన గరుగుమిల్లి శ్రీనివాసరావు రెండు గేదెలు, ఆవులు, 40 కోళ్లను పెంచుతూ నెలకు దాదాపు రూ.40వేలు సంపాదిస్తున్నాడు..  
రాజీవ్‌ గృహకల్ప నివాసి పసల సూర్యచంద్రరావు పాన్‌షాపు నిర్వహిస్తూ గౌరవంగా జీవిస్తున్నాడు.  
ఇలా అనేకమంది నాటుసారా విష వలయం నుంచి బయటకొచ్చి స్వయం ఉపాధితో ఆనందంగా జీవిస్తున్నారు.

- తూర్పుగోదావరి నుంచి సాక్షి ప్రతినిధి  యిర్రింకి ఉమామహేశ్వరరావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement