పల్లెకు పట్టం కడదాం!
చట్టసభ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
‘సాంసద్ ఆదర్శ గ్రామ యోజన’ పథకం ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఓ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించారు. పేరు ‘సాంసద్ ఆదర్శ గ్రామ యోజన’(ఎస్‌ఏజీవై). జయప్రకాశ్ నారాయణ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఈ పథకాన్ని ప్రారంభించి ఆయన ప్రసంగించారు. దేశంలో 800 మంది దాకా ఉన్న ఎంపీల్లో ప్రతి ఒక్కరూ మూడు గ్రామాలను దత్తత తీసుకొని, ఈ పథకం కింద 2019కల్లా ఆ గ్రామాల్లో భౌతికమైన, సంస్థాగతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీ నమూనా గ్రామ పథకంగా పిలిచే ఈ పథకాన్ని మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఎంపీ ఏ గ్రామాన్నయినా దత్తత తీసుకోవచ్చు. అయితే అది తన స్వగ్రామంగాని, అత్తమామల గ్రామంగాని కాకూడదని మోదీ షరతు పెట్టారు. తాను తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో తాను ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
వరంగల్ గ్రామానికి మోదీ ప్రశంసలు..
వరంగల్ జిల్లాలోని గంగాదేవిపల్లిని మోదీ ఆదర్శ గ్రామంగా ప్రశంసించారు. చిన్న గ్రామంలో అభివృద్ధికి ఏర్పాటు చేసిన 28 కమిటీలు ఇప్పటికీ పనిచేస్తున్నాయన్నారు. అలాంటి ఆదర్శగ్రామాలను స్ఫూర్తిగా తీసుకుని ఎంపీ, ఎమ్మెల్యేలు ముందుకు వస్తే ఏడెనిమిది వేల గ్రామాలను అభివృద్ధి చేయవచ్చని, తద్వారా గ్రామీణాభివృద్ధి నమూనాను మార్చవచ్చన్నారు.
ఎమ్మెల్యేలకూ ఈ పథకం పెట్టాలి..
ఎంపీల్లో ప్రతి ఒక్కరూ మూడేసి గ్రామాలను ఎంపిక చేసుకుంటే.. 2019కల్లా 2500 గ్రామాలు అభివృద్ధి బాట పడతాయని మోదీ అన్నారు. మొదటి గ్రామం 2016కల్లా అభివృద్ధి చెందుతుందని, దీని అనుభవంతో మిగతా రెండు గ్రామాలనూ 2019కల్లా అభివృద్ధి చేయగలమని భావిస్తున్నట్లు వివరించారు. తర్వాత ప్రతి ఏటా ఒక గ్రామం అభివృద్ధి చేయొచ్చన్నారు. ‘‘మనకు దాదాపు 800 మంది ఎంపీలున్నారు. 2019కంటే ముందు ప్రతి ఒక్కరూ మూడేసి గ్రామాలను అభివృద్ధి చేస్తే. మనం దాదాపు 2500 గ్రామాలను పూర్తి చేయగలం. ఇదే పంథాలో రాష్ట్రాలు కూడా ఎమ్మెల్యేల ద్వారా పథకం ఏర్పాటు చేస్తే.. అపుడు మరో 6 నుంచి 7 వేల గ్రామాలను అభివృద్ధి చేసే అవకాశముంటుంది’’ అని చెప్పారు. ఓ జిల్లాలో ఒక్క గ్రామం అభివృద్ధి చెందినా.. దాని స్ఫూర్తితో మిగతా గ్రామాలూ వృద్ధి చెందుతాయన్నారు. ఈ పథకం అమలు పరిశీలనకు రియల్ టైమ్ వెబ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హఠాత్తుగా మార్పు తెస్తాననలేదు
ఇంతవరకు సరఫరా ఆధారిత విధానంలో గ్రామాలు అభివృద్ధి చేశారని, ఈ పథకం కింద డిమాండ్ ఆధారంగా గ్రామాల అభివృద్ధి చేయాలని నిర్ణయించామని మోదీ చెప్పారు. తమ గ్రామం గురించి ప్రతి ఒక్కరూ గర్వపడే రోజు వస్తుందన్నారు. ‘‘మేం పని చేయాలనుకుంటున్నాం. ప్రజల భాగస్వామ్యంతో మార్పు తీసుకురాగలమేమో చూడాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితిని హఠాత్తుగా మార్చేస్తానని నేనేమీ చెప్పడం లేదు. ఈ పథకమే అంతిమం కాదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ అన్ని ప్రభుత్వాలూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ స్థాయిలో కృషి చేశాయి. అయితే కాలంతోపాటే మార్పులు, అభివృద్ధి జరగాలి. ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగాలి’’ అని అన్నారు.
రాజకీయాలకు అతీతంగా కృషి ..
రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి బాధ్యత తీసుకోవాలని అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓట్లతో సంబంధం లేకుండా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా గ్రామాభివృద్ధి కోసం సదుపాయాలు కల్పించే వ్యక్తిగా పనిచేయాలని ఎంపీలను కోరారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ నారాయణ్, మహాత్మా గాంధీలను ఆయన ఉదహరించారు. గ్రామాల్లో ప్రముఖుల శుభకార్యాల సందర్భంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో ఆహారపదార్థాలు పంపిణీ చేయించాలని, తద్వారా మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెరగడానికి ఇది దోహదం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా ఆదర్శగ్రామ పథకం విశేషాలను, గ్రామాల అభివృద్ధికి చేయాతనివ్వాల్సిన అంశాలను వివరిస్తూ మాట్లాడారు.
‘‘దేశంలోని 400లకు పైగా జిల్లాల్లో 5వేల గ్రామాల్లో నేను పర్యటించాను. గ్రామాల పరిస్థితిపై నా స్వీయ అనుభంతో చెపుతున్నా. ఈ గ్రామాలను ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయగలమని అర్థమైంది. ఇది డబ్బుపై ఆధారపడి నడిచే పథకం కాదు. ప్రజలపై ఆధారపడి నడిచేది. ప్రజల భాగస్వామ్యంతో ఇది మరింత పరుగులు పెడుతుంది’’.
‘‘దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలున్నాయి. అయితే ప్రతి రాష్ట్రంలో కొన్ని గ్రామాలు మాత్రమే ఆ రాష్ట్రం గర్వపడేలా ఉన్నాయి. అంటే అక్కడ నాయకత్వం, ప్రజలు ప్రభుత్వ పథకాల కంటేఅదనంగా చేసింది ఏదో ఉంది. ఈ అదనంగా ఉన్నదే.. ఈ సాంసద్ ఆదర్శ గ్రామ యోజనకు స్ఫూర్తి.’’
- నరేంద్ర మోదీ
ఆదర్శగ్రామం ‘గంగాదేవిపల్లి’పై లఘుచిత్ర ప్రదర్శన
ఆదర్శగ్రామ యోజన ఆవిష్కరణ సందర్భంగా దేశంలోని ఆదర్శగ్రామాలపై లఘుచిత్రాలను ప్రదర్శించారు. అన్నింటికన్నా ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగాదేవిపల్లి ఆదర్శగ్రామాన్ని ప్రదర్శించారు. ప్రజల భాగస్వామ్యం, సుపరిపాలన, సమర్థనేతృత్వం వెరసి ఆదర్శగ్రామం లక్ష్యాన్ని సిద్ధించింది. వందశాతం పారిశుద్ధ్యం, తాగునీటి కల్పన, విద్య, పక్కారోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, పొదుపు సంఘాల పనితీరు, ఇతర అభివృద్ధి పనుల ద్వారా ఆదర్శ గ్రామంగా నిలిచి సభికుల ప్రశంసలను అందుకుంది. కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్, గ్రామ సర్పంచ్ ఇట్ల శాంతి, ఉప సర్పంచ్, గ్రామ అభివృద్ధి శాఖ కమిటీ అధ్యక్షుడు కె.రాజమౌళి హాజరయ్యారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆదర్శగ్రామ యోజన ఆవిష్కరణ సభలో గంగాదేవిపల్లి గ్రామాన్ని ప్రదర్శించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గ్రామాన్ని మరింత ఉన్నతంగా తీర్చదిద్దడానికి కృషిచేస్తామని చెప్పారు.