భాగ్యనగర భగీరథుడు
భాగ్యనగర భగీరథుడాయన. మూసీ, మంజీరా నదులకు ఆనకట్టలు కట్టి ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చిన మహనీయుడాయన. ఉస్మాన్ సాగర్, నిజాంసాగర్, హిమాయత్ సాగర్, అలీసాగర్, నందికొండ ప్రాజెక్టు వంటి నిర్మాణాలన్నీ ఆయన చలవే. ఆధునిక హైదరాబాద్ నిర్మాణంలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ పోషించిన పాత్ర చిరస్మరణీయం. శతాబ్దాల కిందట కులీకుతుబ్ షాల కాలంలో హుస్సేన్‌సాగర్ నిర్మించిన తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో చాలాకాలం పాటు కొత్తగా వెలసిన ఆనకట్టలేవీ లేవు.
మూసీ నదికి అడపా దడపా వరదలు వస్తుండేవి. వరదలను అడ్డుకునే కట్టడమేదీ ఉండేది కాదు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాలేదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వంలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ చొరవతో హైదరాబాద్ నగరం సహా తెలంగాణ ప్రాంతంలో పలు ఆనకట్టలు వెలశాయి. నవాబ్ అలీ సారథ్యంలోనే పలు ప్రతిష్టాత్మకమైన కట్టడాలూ రూపుదిద్దుకున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు రూపకల్పన చేసినది ఆయనే.
ఇంజనీర్‌గా ప్రస్థానం..
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. ఆయన తండ్రి మీర్ వయిజ్ అలీ నిజాం సర్కారులో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసేవారు. హైదరాబాద్‌లో 1877 జూలై 11న జన్మించిన నవాబ్ అలీ, ఇక్కడి సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్లో, మదర్సా-ఇ-ఆలియాలలో పాఠశాల విద్య పూర్తి చేశారు. తర్వాత నిజాం కాలేజీలో చేరారు. చురుకైన విద్యార్థిగా గుర్తింపు పొందడంతో విదేశాల్లో చదువుకునేందుకు సర్కారు స్కాలర్షిప్ లభించింది. ఇంగ్లండ్‌లోని కూపర్స్ హిల్ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు.
హైదరాబాద్‌కు 1899లో తిరిగి వచ్చాక ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1913లో ప్రజా పనుల శాఖతో పాటు టెలిఫోన్ శాఖకు కార్యదర్శిగా నియమితుడుయ్యారు. మరో ఐదేళ్లకు, 1918లో చీఫ్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందారు. నవాబ్ అలీ చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న కాలంలోనే ఆయన ఆధ్వర్యంలో భారీ సాగునీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. ఆయన హయాంలోనే టెలిఫోన్ సేవలు జిల్లాలకు విస్తరించాయి. ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ భవనం, యునానీ ఆస్పత్రి, జూబ్లీ హాల్, ఉస్మానియా ఆస్పత్రి వంటి భవనాల నిర్మాణానికీ ఆయనే సారథ్యం వహించారు.
అప్పటి బాంబే ప్రభుత్వం కూడా నవాబ్ అలీ సేవలను వినియోగించుకుంది. సింధు నదిపై సుక్కుర్ బ్యారేజీ నిర్మాణం కోసం ఆర్థిక, సాంకేతిక సలహాల కోసం సంప్రదించింది. మోక్షగుండం విశ్వేశరయ్యతో కలసి నవాబ్ అలీ సుక్కుర్ బ్యారేజీ నిర్మాణంపై బాంబే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అప్పటి మద్రాసు, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య తలెత్తిన కృష్ణా, తుంగభద్ర నదీజలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించడంలోనూ నవాబ్ అలీ కీలక పాత్ర పోషించారు. నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన ఆనకట్టకు ఆయన గౌరవార్థం అలీ సాగర్‌గా నామకరణం చేశారు.
గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం..
సాగునీటి రంగంలో గణనీయమైన సేవలు అందించిన నవాబ్ అలీ జంగ్ బహదూర్‌కు దురదృష్టవశాత్తు తగినంత ప్రాచుర్యం లభించలేదు. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం నవాబ్ అలీ సేవలను గుర్తించింది. నవాబ్ అలీ జ్ఞాపకార్థం ఆయన పుట్టిన రోజైన జూలై 11న తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించింది.