ఇక నిఘా తీవ్రతరం
పోలీసుల చెంతకు అత్యాధునిక వాహనాలు
{పారంభించిన ఎస్పీ ఆకె రవికృష్ణ
{పత్యేకతల ఇంటర్ సెప్టర్ వాహనం
కర్నూలు : అసాంఘిక కార్యకలపాలను అడ్డుకునేందుకు, నేర నియంత్రణ కోసం పోలీస్ శాఖకు అత్యాధునిక వాహనాలు వచ్చాయి. వీటి సాయంతో నిఘాను తీవ్రతరం చేయవచ్చు. పోలీసు యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇంటర్‌సెప్టర్ హైవే పెట్రోలింగ్ వాహనాలను జారీ చేసింది. జిల్లా పోలీసు శాఖకు ఇచ్చిన వీటిని బుధవారం ఉదయం పోలీస్ కార్యాలయ పెరేడ్ మైదానంలో ఎస్పీ ఆకే రవికృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో ఒకటి ఇంటర్‌సెప్టర్ మహింద్రా జైలో, మూడు ఫోర్డ్ కార్లు ఉన్నాయి.
ఇంటర్ సెప్టర్ వాహనం ప్రత్యేకత...
ఇంటర్‌సెప్టర్ వాహనం 360 డిగ్రీలు చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలను, 1.5 కిలోమీటర్ల దూరంలో వస్తున్న వాహనాలను ముందుగానే గుర్తిస్తుంది. అతివేగంగా వచ్చే వాహనాల నంబర్ ప్లేట్లను, మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించి ఇందులో అమర్చిన కెమెరా ద్వారా క్లిక్ చేసి.. జరిమానా విధించవచ్చు. ఈ వాహనంలో అడ్వాన్స్డ్ బ్రీత్ అనలైజర్, జీపీఎస్ సిస్టమ్, కంప్యూటర్ ఉంటాయి. వీఐపీ బందోబస్తు సమయంలో కూడా 1.5 కిలోమీటర్ల దూరం నుంచి వివిధ రకాల పరిస్థితులను ఈ వాహనం క్షుణ్ణంగా పరిశీలించి రికార్డు చేస్తుంది.
ఈ వాహనాలను ప్రత్యేకంగా హైవే పెట్రోలింగ్‌కు ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాలకు ఆధునిక టెక్నాలజీలో ఉన్న కెమెరా అమర్చి ఉండటమే కాక ఒక కంప్యూటర్ ఆపరేటర్, డ్రైవర్, ఇన్చార్జి ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ ఉంటారు. ఇవి నిరంతరం జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేస్తూ రోడ్డు ప్రమాద నివారణ కోసం పనిచేస్తాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శివకోటి బాబురావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, ఆళ్లగడ్డ ఏఎస్పీ శశికుమార్, డీఎస్పీలు రమణమూర్తి, ఏజీ కృష్ణమూర్తి, బాబుప్రసాద్, డి.ఆర్.శ్రీనివాసులు, వి.వి.నాయుడు, పి.ఎన్.బాబు, దేవదానం, హరినాథరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, సుప్రజ, సీసీఎస్ సీఐ రవిబాబు, ఆర్ఐ రంగముని, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.