కరుగుతున్న కరకట్ట
వేటపాలెం: కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల ఆధునికీకరణ పనుల్లో అవినీతి తాండవిస్తోంది. జిల్లా పరిధిలోని రొంపేరు రైట్టరం, లెఫ్ట్టరంతో పాటు అనేక డ్రైనేజీలు (వ్యవసాయ మురుగు కాలువలు) ఆధునికీకరించాలని ప్రభుత్వం 2006లో తలపెట్టింది. అందులో భాగంగా వేటపాలెం పరిధిలోని ముసలమ్మ మురుగునీటి కాలువను ఆధునికీకరించారు.
అయితే ఈ కాలువపై వేటపాలెం- సంతరావూరు మధ్య గతంలో ఉన్న నేలచప్టాపై రూ.1.10 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ఐదు నెలల కిందట పనులు చేపట్టారు. రోడ్డు మధ్యలో ఉన్న నేలచప్టాను తొలగించి రాకపోకలకు పక్కనే తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం కోసం పక్కనే ఉన్న ముసలమ్మ మురుగునీటి కాలువ కరకట్ట మట్టిని పొక్లెయిన్ సహాయంతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. కాంట్రాక్టు నిబంధనల మేరకు బ్రిడ్జి నిర్మాణం కోసం బయట ప్రాంతం నుంచి మట్టిని కొనుగోలు చేసి వినియోగించాలి. అయితే బయటి ప్రాంతం నుంచి మట్టిని తరలిస్తే లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని..సదరు కాంట్రాక్టరు కాలువ కరకట్టను ధ్వంసం చేసి మట్టిని తరలిస్తున్నారు. అధికారుల అండదండలతోనే మురుగునీటి కాలువల కరకట్ట మట్టి అక్రమంగా తరలిపోతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
తరచూ ముంపునకు గురవుతున్న పొలాలు:
ముసలమ్మ మురుగునీటి కాలువపై ఐదు నెలలుగా నత్తనడకన సాగుతున్న బ్రిడ్జి నిర్మాణంతో ఆప్రాంతంలోని పొలాలు తరచూ ముంపునకు గురవుతున్నాయి. నేల చప్టా తొలగించిన ప్రాంతం పక్కనే కాలువలో నీటి పారుదలకు తాత్కాలికంగా తూములు ఏర్పాటు చేయకపోవడంతో వర్షాలు కురిసిన సమయంలో వచ్చిన వరదలకు పొలాలు మునిగిపోతున్నాయి. రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు పొలాలు ముంపు బారిన పడ్డాయి. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కరకట్టల మట్టిని తరలించిన వారిపై చర్యలు:
మురుగునీటి కాలవ కరకట్ట మట్టిని అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకొంటామని డీఈ సుబ్బారావు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి కరకట్ట మట్టిని వినియోగిస్తే నిధులు రికవరీ చేస్తామన్నారు. బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయిస్తామని చెప్పారు.