కాంగ్రెస్ ప్రభుత్వమే మోడీ కులాన్ని బీసీల్లో చేర్చింది
హైదరాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఓబీసీ కాదంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలపై బీజేపీ దీటుగా స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వమే మోద్ గాంచిస్ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని, మోడీ ఇదే కులానికి చెందిన వారని స్పష్టం చేసింది.
1994లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గుజరాత్ ముఖ్యమంత్రి చబిల్దాస్ మెహతా మోద్ గాంచిస్ను ఓబీసీ కేటగిరిలో చేర్చారని, కాంగ్రెస్ పార్టీ మోడీ కులంపై అబద్ధాలు చెబుతూ వివాదం చేస్తోందని బీజేపీ విమర్శించింది. బక్షి కమిషన్ సిఫారసు మెహతా ఆమోదించారంటూ బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు చెప్పారు. మోడీ నకిలీ ఓబీసీ అని, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే తన కులాన్ని బీసీల జాబితాలో చేర్చారని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. మోడీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందని వెంకయ్య నాయుడు విమర్శించారు.