కలివికోడీ...కనిపించవే..!
ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. అందులోనూ అంతరించిపోతున్న జాతుల్లో ఇదీ ఒకటి. ఈ పిట్ట 30 ఏళ్ల క్రితం ఒక్కసారి తళుక్కుమంది. అప్పటినుంచి ఇప్పటివరకు చూస్తామంటే కనిపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు కుమ్మరిస్తున్నా జాడ కూడా దొరకలేదు. రాత్రిపూట మాత్రమే తిరగాడే ఈ పిట్ట ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు శోధిస్తున్నారు. ఆ పిట్టే కలివికోడి. ఇది 1948లో బ్రిటీషు సైన్యాధిపతి చూశారు. తర్వాత 1986లో వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలంలోని కొండూరు బీటులో ముచ్చెమ్మకుంటలో కనిపించింది. అప్పటినుంచి ఇప్పటివరకు జాడలేదు. ప్రపంచంలో ఎక్కడా లేని కలివికోడి లంకమల అటవీప్రాంతంలో కనిపించిన నేపథ్యంలో ఇక్కడే కలివికోడి జాతికి చెందిన పక్షులుంటాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
30 ఏళ్లుగా నిరీక్షణ..
1986లో ఒక్కసారి మాత్రమే కనిపించిన కలివికోడి జాడ కోసం అటవీ అధికారులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇప్పటికి స్థానిక అధికారులు వెతుకులాట కొనసాగిస్తునే ఉన్నారు. ఆరుగురు ప్రత్యేక ప్రొటెక్షన్ సిబ్బందితోపాటు సుమారు 144 కెమెరాలను త్వరలోనే అమర్చేందుకు అటవీశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నెలకు కెమెరా బ్యాటరీలకు, సిబ్బంది జీతాలకుగాను దాదాపు రూ.45 వేలు ఖర్చు వస్తోంది. లంకమల్లేశ్వర అభయారణ్యంలో ఉన్న వేలాది హెక్టార్లలో ఈ కెమెరాలను అమర్చనున్నారు.
పరిశోధనల్లో కనిపించని ఫలితం
ఎనిమిదేళ్ల క్రితం ముంబయికి చెందిన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన సభ్యులు ఇక్కడ పరిశోధనలు చేశారు. ఉదయాన్నే అడవిలోకి బయలుదేరడం, సాయంత్రానికి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటూ కొంతమంది సభ్యుల బృందం నాలుగేళ్లపాటు కలివికోడి ఆనవాళ్ల కోసం పరిశోధనలు చేశారు. అడవిని గాలించినా...అంతా శోధించినా జాడ కనిపించలేదు. నాలుగేళ్లపాటు లంకమల అభయారణ్యంలో జల్లెడ పట్టిన పరిశోధన బృందం ఉసూరుమంటూ వెనుదిరిగింది. కొండూరులో ఉన్న పరిశోధన కేంద్రం ప్రస్తుతం మూతపడింది.
భారీగా ఖర్చు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలివికోడి ఆచూకీ కోసం రూ.50 కోట్లకు పైగా ఖర్చుచేశాయి. అట్లూరు మండలంలోని కొండూరు, ఎస్.వెంకటాపురం, గుజ్జలవారిపల్లె, తంబళ్లగొంది, ఎర్రబల్లి, బద్వేలు మండలంలోని రాజుపాలెం, తిప్పనపల్లె తదితర గ్రామాల్లోని సుమారు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి కలివికోడి సంరక్షణ అభయారణ్యంలో కలిపింది. అందుకోసం రైతుల భూములకు పరిహారంగా రూ.28 కోట్లు చెల్లించారు. ఇతర అన్ని అవసరాలకు మరో రూ.22 కోట్లకు పైగా ఖర్చుచేశారు. సిద్దవటం-బద్వేలు రోడ్డును ఇప్పుడు కూడా అభయారణ్యం పరిధిలో ఇబ్బంది కలుగుతుందని రాత్రిపూట వాహనాలను నిలిపివేస్తున్నారు. అనేకరకాల చిత్ర విచిత్రమైన జంతువులు అడవిలో అమర్చిన కెమెరాల్లో కనిపిస్తున్నా...కలివికోడి మాత్రం కనిపించకపోవడం అధికారులను కలవరపెడుతోంది.
కనిపిస్తుందని ఆశ ఉంది: మహమ్మద్ దివాన్ మైదిన్, కడప అటవీశాఖాధికారి
లంకమల్లేశ్వర అభయారణ్యంలో నిధుల కొరతతో కెమెరాలు దాదాపు ఎనిమిది నెలలుగా అమర్చలేదు. రీవ్యాలిడేషన్ నిధులు ఉండటంతో ప్రస్తుతం 144 కెమెరాలను అడవిలో పెట్టేందుకు సిద్ధమయ్యాం. త్వరలోనే వాటిని అక్కడక్కడ బిగించి కలివికోడి కోసం శోధిస్తాం. ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. కనిపిస్తుందన్న ఆశ మాత్రం ఉంది.