పోలీసు వాహనాన్ని ఢీకొట్టి...హోంగార్డు కిడ్నాప్
సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: పోలీసు వాహనాన్ని ఢీకొట్టినందుకు ఠాణాకు రమ్మని కోరిన హోంగార్డ్ను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్ఐ నరేశ్ కథనం ప్రకారం... చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ హకీం(29) కోఠి ట్రూప్‌బజార్‌లో ఎలక్ట్రానిక్స్ షాపు నిర్వహిస్తున్నాడు.
అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫరాన్(20), మహ్మద్ రియాన్(18) ఇతని వద్ద సేల్స్మన్లుగా పని చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి 11 గంటలకు కానిస్టేబుల్ మాదవయ్య, హోంగార్డ్ ముత్యాలు తెరచి ఉన్న దుకాణాలను మూసి వేయిస్తున్నారు. కోఠి బ్యాంక్‌స్ట్రీట్ వద్ద పార్క్ చేసి ఉన్న పోలీసుల వాహనాన్ని అబ్దుల్ హకీం తన మారుతీ కారుతో ఢీకొట్టాడు. ఆగ్రహానికి గురైన పోలీసులు కారులో ఉన్న ముగ్గురు యువకులను మందలించడంతో వాగ్వాదం జరిగింది.
కానిస్టేబుల్ మాదవయ్య కారు తాళాలు లాక్కున్నాడు. దీనికి ప్రతిగా వారు పోలీసుల వాహనం తాళాన్ని లాక్కున్నాడు. దీంతో కానిస్టేబుల్ వారికి కారు తాళాలు ఇచ్చేశాడు. పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పి ముత్యాలును కారులో కూర్చోబెట్టాడు. ఇదే అదనుగా భావించిన ఆ యువకులు కారును ఉస్మానియా మెడికల్ కళాశాల వైపు పోనిచ్చారు. మార్గం మధ్యలో హోంగార్డ్‌పై ముష్టిఘాతాలు కురిపించారు. కారును ఛాదర్ఘట్ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
వెనుకే వస్తున్న కానిస్టేబుల్ ఇది గమనించి..వెంటనే సుల్తాన్‌బజార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సెట్లో కారు నెంబర్, ఇతర వివరాలు తెలిపి ఛాదర్‌ఘాట్ పోలీసులను అప్రమత్తంచేశారు. ఎస్ఐ శ్రీకాంత్ ట్రాఫిక్‌ను నిలిపి వేసి సదరు కారు కోసం వెతుకుతుండగా అప్పటికే కారు ఛాదర్ ఘాట్ దాటిపోయింది. పోలీసులను చూసి హోంగార్డ్ అరవడంతో ఛేజింగ్ చేసి మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి వద్ద కారును పట్టుకొని హోంగార్డ్ను విడిపించారు. ముగ్గురు నిందితులను సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించగా.. కిడ్నాప్, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.