మరో ఐఎస్ ఉగ్రవాది పట్టివేత
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న 25 ఏళ్ల యువకుడిని పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ మసియుద్దీన్ అలియాస్ మూసా అనే ఈ యువకుడిని బర్ద్వాన్ రైల్వే స్టేషన్లో పట్టుకుని, సీఐడీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. విశ్వభారతి ప్యాసింజర్ రైలు నుంచి అతడిని పట్టుకున్నారు. బిర్భూమ్ జిల్లాలోని తన స్వగ్రామం లభ్పూర్ వెళ్తుండగా అతడు దొరికాడు. ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న యువకుడు చెన్నై నుంచి హౌరా మీదుగా బిర్భూమ్ వెళ్తున్నట్లు తమకు సమాచారం అందిందని, దాని ఆధరాంగా మసియుద్దీన్ను బర్ద్వాన్ రైల్వేస్టేషన్లో పట్టుకున్నామని సీఐడీ డీఐజీ దిలీప్ కుమార్ అడక్ తెలిపారు.
లభ్పూర్కు చెందిన మసీయుద్దీన్ తమిళనాడులోని తిరుప్పూర్లో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటూ ఓ కిరణా దుకాణంలో పనిచేసేవాడు. అతడి వద్ద నుంచి 13 అంగుళాల కత్తి, అత్యాధునిక తుపాకి, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని, అతడి మొబైల్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నామని అడక్ చెప్పారు. కేంద్ర నిఘా సంస్థలు అతడిని విచారిస్తున్నాయన్నారు. ప్రాథమిక విచారణను బట్టి విదేశీ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు తెలిసిందని, ఐఎస్ అవునా కాదా అన్న విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని చెప్పారు.