సల్మాన్ ఖాన్‌పై చర్య తీసుకోవాలి
* బిగ్‌బాస్ రియాల్టీ షోలో ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని 2013లో ఫిర్యాదు
* ఇప్పటికీ కేసు నమోదు చేయలేదని ఫిర్యాదుదారుడి ఆరోపణ
సుల్తాన్‌బజార్: బిగ్‌బాస్ రియాల్టీ షోలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని, ఈ విషయంపై తాము 2013లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మహ్మద్ ఫసీమొద్దీన్ అనే వ్యక్తి ఆరోపించారు. గురువారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో తన అడ్వకేట్ అబ్బాస్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బిగ్‌బాస్ రియాల్టీ షోలో కుక్కను స్వర్గంలా చిత్రీకరించారని 2013 డిసెంబర్ 13వ తేదీన ఫలక్‌నుమా, అక్టోబర్ 2న బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లలో తాము సల్మాన్‌ఖాన్‌పై ఫిర్యాదు చేశామని, ఇంతవరకు పోలీసులు చట్టపరమైన విచారణ, దర్యాప్తుగానీ జరపలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తన సోదరి పెళ్లి కోసం వస్తున్న సల్మాన్‌ఖాన్‌ను పోలీసులు విచారించాలని ఈ సందర్భంగా వారు కోరారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఈ నెల 16న పీస్ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సల్మాన్‌ఖాన్, అందులో నటించిన సైఫ్అలీఖాన్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చొరవ చూపాలన్నారు.