‘ఇలాంటి వేదన మరెవరికీ రాకూడదు’
సహచర విద్యార్థి దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చిన్నారి మహ్మద్ ఇబ్రహీం కుటుంబం విషాదం నుంచి ఇంకా తేరుకోలేదు. కొడుకు మృతితో తండ్రి అబ్దుల్ ముజీబ్, తల్లి జరీనాబేగం కన్నీటి పర్యంతం అవుతున్నారు. అన్న ఇక రాడా.. అంటూ ఇబ్రహీం తోబుట్టువులు ఉమర్, అలీజాఫాతిమా అమాయకంగా అడుగుతున్న ప్రశ్నలకు ఆ దంపతులు బదులివ్వలేకపోతున్నారు.
టోలిచౌకిలోని ఐఏఎస్ కాలనీలో ఉన్న ప్రామిసింగ్ కాన్సెప్ట్ హైస్కూల్లో ఇదే ప్రాంతంలో నివసిస్తున్న ఆరున్నరేళ్ల మహ్మద్ ఇబ్రహీం ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే ఈ నెల 12వ తేదీన స్కూల్‌కు వెళ్లాడు. అదే పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల విద్యార్థి కోపం పట్టలేక ఇబ్రహీం మర్మాంగంపై మోకాలితో తన్నడంతో ఇబ్రహీం భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి బాల్కానీలో దాక్కున్నాడు. అయినాసరే ఆ విద్యార్థి ఆగలేదు. దాక్కున్న ఇబ్రహీంను బయటకు లాగి మూడుసార్లు మోకాలితోనే పొత్తికడుపులో, మర్మాంగాలపైన తన్నాడు.
దీంతో ఇబ్రహీం తీవ్ర నొప్పితో అవస్థలు పడుతూనే సాయంత్రం దాకా ఏడుస్తూ మెట్ల కింద కూర్చొని బడి వదిలిపెట్టగానే ఇంటికి వెళ్లి మంచమెక్కాడు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా సీనియర్ విద్యార్థి కొట్టాడంటూ చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల13వ తేదీన నీలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూనే ఈ నెల 16న ఇబ్రహీం కన్నుమూశాడు. ఈ ఘటనపై తండ్రి ముజీబ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై జాతీయ బాలల హక్కుల కమిషనర్, పాఠశాల విద్యాశాఖ విచారణకు ఆదేశించాయి. అయితే ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇంత వరకు పాఠశాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ముజీబ్ ప్రశ్నిస్తున్నారు. పాఠశాలను మూసివేయాలని తన కొడుకు మృతికి కారకుడైన విద్యార్థిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం టోలిచౌకిలోని తన నివాసంలో ఆయన జరిగిన ఘటనపై, అధికారుల తీరుపై మండిపడ్డారు.
తన కొడుకు మరణానికి పాఠశాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పాఠశాల ఆవరణలో ఒక విద్యార్థిని ఇంకో విద్యార్థి తరిమితరిమి కొడుతుంటే ఉపాధ్యాయులు చూడరా అని నిలదీశారు. ఇంత జరిగినా స్కూల్‌ను ఎందుకు సీజ్ చేయలేదని నిలదీశారు. తక్షణం న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ అయింది తప్పితే న్యాయం మాత్రం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని ఆరోపించారు. తన కొడుకు జరిగిన దుస్థితి మరొకరికి జరగకుండా ఉండాలంటే స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఘటన జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప, స్కూళ్లలో విద్యార్థులకు రక్షణ ఏపాటి ఉందో తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే కమిషనర్ వద్దకు వెళ్తామని అన్నారు.