పాక్ ఉగ్రవాదికి సహకరించిన నలుగురి అరెస్టు
శ్రీనగర్ : ఈనెల 5న జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడి కి సహకరించిన నలుగురు వ్యక్తులను శనివారం అరెస్టు చేశారు. ఉధంపూర్‌లో దాడి చేసిన ఇద్దరు పాక్ ఉగ్రవాదుల్లో మహమ్మద్ నవేద్‌ను పట్టుకోవడం తెలిసిందే. నవేద్‌కు ఈ దాడిలో స్థానికంగా ఎవరు సహకరించారో తెలుసుకోవడానికి అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు జమ్మూ ప్రాంతం నుంచి కశ్మీర్‌లోయ ప్రాంతానికి తీసుకువచ్చారు. పుల్వామా జిల్లాలో తనకు సహకరించిన నలుగురు వ్యక్తుల గురించి నవేద్ సమాచారం ఇవ్వడంతో వారిని అరెస్టు చేశారు. ఈ నలుగురు కశ్మీర్లో లష్కరే సంస్థ స్లీపర్‌సెల్‌లో సభ్యులని నిఘా వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదిని పట్టుకున్నవారికి నగదు బహుమతి
నవేద్‌ను పట్టుకున్న ఇద్దరు యువకులను జమ్మూ కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ ‘పాంథర్స్ సాహస అవార్డు’తో సత్కరించింది. జమ్మూలో విక్రంజిత్, రాకేశ్‌లకు చెరో రూ.21వేలను పార్టీ నేత బల్వంత్ సింగ్ అందజేశారు.
ఎదురు కాల్పులు.. కాగా పాక్ సరిహద్దుల్లోని అధీనరేఖ వద్ద తాంగ్ధర్ సమీపంలో శనివారం సైనిక దళాలు కొంతమంది మిలిటెంట్లను అడ్డుకున్నాయి. మిలిటెంట్లను సైనికదళాలు హెచ్చరించడంతో వారు కాల్పులు జరిపారని, దాంతో జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారని ఆర్మీ తెలిపింది.