ఉధంపూర్ ఘటన: 'ట్రక్ డ్రైవర్' అరెస్ట్
శ్రీనగర్:ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో కాల్పులకు పాల్పడి సజీవంగా పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్ యాకుబ్ కు సహకరించిన ట్రక్ డ్రైవర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ అదికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రక్ డ్రైవర్ ను శుక్రవారం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 5వ తేదీన ఓ ట్రక్ సహాయంతో భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు నవేద్ యాకుబ్, నామన్ లు జమ్మూ-శ్రీనగర్ హైవేపై పోలీసుల కంటపడ్డారు. దీంతో ఆ ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెరలేపారు. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఉగ్రవాది నామన్ ను జవాన్లు హతమార్చారు. అయితే ఉగ్రవాదులు ట్రక్ సాయంతో జమ్మూలోకి ప్రవేశించడంతో ఎన్ఐఏ అధికారులు ముమ్మర గాలింపు చేపట్టి ఎట్టకేలకు ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.