జలీల్ఖాన్ను తక్షణమే అరెస్టు చేయాలి: ఐజేయూ
సాక్షి, హైదరాబాద్: కాకతీయ దినపత్రిక సంపాదకులు మహమ్మద్ షఫీపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే జలీల్ఖాన్ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజే యూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమర్నాథ్లు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ జర్నలిస్టులపై దాడికి దిగడం ఇది తొలిసారి కాదన్నారు. వారం క్రితం సాక్షి జర్నలిస్ట్‌పై తన అనుచరులతో కలసి దాడి చేసి కెమెరా ధ్వంసం చేశారని, జర్నలిస్టులను పరుష పదజాలంతో దూషించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే తీరుపై ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, జలీల్‌ఖాన్‌పై ఏపీ శాసనసభా స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.