మోహన్‌నాథ్ గోస్వామికి అశోకచక్ర
శ్రీనగర్: ఉగ్రవాదులపై పోరులో అసువులుబాసిన అమర జవాను, భారత ఆర్మీ ప్రత్యేక దళాల కమాండో లాన్స్ నాయక్ మోహన్‌నాథ్ గోస్వామికి కేంద్రం అత్యున్నత శౌర్య పురస్కారం అశోకచక్రను ప్రకటించింది. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తోటి జవాన్లను కాపాడే క్రమంలో గోస్వామి నేలకొరిగారు. దేశం గర్వించేలా చేసిన గోస్వామి మరణంలోనూ జీవించే ఉన్నాడని, అతని ఆత్మత్యాగం.. పరాక్రమానికి గుర్తింపుగా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని అశోక చక్రను ప్రకటించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఎన్కౌంటర్లో గోస్వామి ఉగ్రవాదుల బుల్లెట్లు శరీరాన్ని చీల్చుకుపోయినా వెరవకుండా.. ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాకుండా తన సహచరులను రక్షించాడు.
మిగతా ముఖ్యమైన శౌర్యపతకాల విజేతలు
కీర్తి చక్ర: సుబేదార్ మహేంద్ర సింగ్ (9 పారా స్పెషల్ ఫోర్స్), సిపాయి జగదీశ్‌చంద్(546 డీఎస్సీ ప్లాటూన్-మరణానంతరం), శౌర్య చక్ర: (కల్నల్ సంతోశ్ (మరణానంతరం), మేజర్ అనురాగ్ కుమార్, నాయక్ సతీశ్ కుమార్ (మరణానంతరం), సిపాయి ధర్మరామ్ (మరణానంతరం), మరో నలుగురికి.
26 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి మెడల్స్
శారద చిట్‌ఫండ్ స్కాం, షీనా బోరా హత్య కేసులను విచారించిన అధికారులు సహా 26 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పురస్కారం, పోలీసు ప్రతిభా పురస్కారాలు దక్కాయి. శారదా స్కామ్‌పై సిట్ బృంద సారథి రాజీవ్‌సింగ్‌ను విశిష్ట సేవా పతకం వరించింది. షీనా హత్య కేసును దర్యాప్తు చేసిన లతా మనోజ్‌కుమార్‌కు ప్రతిభా పురస్కారం దక్కింది.