సహారన్‌పుర్ అల్లర్ల ప్రధాన నిందితుడి అరెస్ట్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో అల్లర్ల ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొహ్రం అలీ అలియాస్ పప్పుతో పాటు మరో అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు పోలీసులు సహా 18 మంది గాయపడ్డారు. ఒక వివాదాస్పద భూమి విషయంలో శనివారం చెలరేగిన గొడవ ఇరు వర్గాల మధ్య హింసకు దారితీసింది.
ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. ఇళ్లకు, షాపులకు నిప్పుపెట్టారు. అంతేగాక కాల్పులకు కూడా తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి దనీష్, మహ్మద్ ఇర్షాద్, అబీద్, షహీద్, హజీ మహ్మద్ ఇర్ఫాన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొహ్రం అలీ అరెస్ట్‌ను జిల్లా పోలీస్ అధికారి రాజేష్ పాండే ధ్రువీకరించారు.