Mohit Goel
-
‘ఫ్రీడం 251’ మోహిత్ గోయల్ మళ్లీ అరెస్ట్
నాలుగేళ్ల క్రితం డెడ్ చీప్‌గా స్మార్ట్‌ఫోన్ అందిస్తానంటూ ప్రకటన చేసిన మోహిత్ గోయల్ గుర్తున్నాడా? దేశం మొత్తం కుదిపేసిన ‘ఫ్రీడం 251 ఫోన్’ స్కాం ప్రధాన నిందితుడైన ఈ మోహిత్‌ను ఇప్పుడు పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని 41 లక్షలకు ముంచడంతో పాటు చంపేందుకు ప్రయత్నించిన నేరారోపణలపై గ్రేటర్ నోయిడా పోలీసులు మోహిత్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గోయల్‌తో పాటు మరో ఐదుగురిపైనా 41 లక్షల రూపాయలకు సంబంధించిన లావాదేవీల మోసంపై ఇందిరాపురం చెందిన వికాస్ మిట్టల్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం గ్రేటర్ నోయిడాలోని గోయోల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రై ఫ్రూట్స్ అమ్మకాలకు సంబంధించిన వ్యహారంలో మోసం చేయడమే కాకుండా.. డబ్బుల గురించి నిలదీస్తే చంపేస్తానని వికాస్‌ను చెదిరించాడు గోయల్. అంతేకాదు కారుతో ఢీ కొట్టి చంపేందుకు ప్రయత్నించాడని వికాస్ ఆరోపిస్తున్నాడు. దీంతో వికాస్ ఫిర్యాదు మేరకు మోహిత్ గోయల్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మోసం, దోపిడీ, చంపేస్తానని బెదిరించడం, గాయపర్చడం.. ఇలా పలు నేరాలకుగానూ ఐపీసీ సెక్షన్లతో మోహిత్‌పై కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే 2017లో రింగింగ్ బెల్ అనే కంపెనీ ద్వారా ఫ్రీడం 251 స్మార్ట్ఫోన్ల అమ్మకం ప్రకటన ద్వారా సంచలనానికి తెరలేపిన మోహిత్.. భారీ స్కామ్‌తో వార్తల్లోకి ఎక్కి అరెస్టైన విషయం తెలిసిందే. ఆపై దుబాయ్ డ్రై ఫఫ్రూట్స్ అండ్ స్పైసిస్ పేరుతో ఓ ఆఫీస్ తెరిచి.. సుమారు 200 కోట్ల స్కాంకు పాల్పడ్డాడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ డ్రై ఫ్రూట్స్ వ్యవహారంలో పలు రాష్ట్రాల నుంచి అతనిపై 35 కేసులు నమోదు అయ్యాయి. చదవండి: సిండికేట్ బ్యాంక్‌లో మోసం కేసులో సీబీఐ చార్జ్‌షీట్ -
అడ్డంగా బుక్కైన రూ.251 స్మార్ట్‌ఫోన్ ఫౌండర్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చౌక ధరకే స్మార్ట్‌ఫోన్ అంటూ వార్తల్లో నిలిచిన రింగింగ్ బెల్స్ వ్యవస్థాపకుడు మోహిత్ గోయెల్ మరోసారి వెలుగులోకి వచ్చాడు. వ్యాపారవేత్తలను బెదిరించిన కేసులో ఢిల్లీ పోలీసులు మోహిత్ గోయెల్‌ను అరెస్టు చేశారు. ఒక మహిళతో కలిసి అక్రమంగా గ్యాంగ్‌రేప్ ఆరోపణలు చేయడంతో పాటు బలవంతపు వసూళ్ళకు పాల్పడిన కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ‘భీవాండి గ్యాంగ్ రేప్ కేసు' గా పేరొందిన కేసులో నిందితులుగా ఉన్న వ్యాపారవేత్తలపై ఓ మహిళతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందుతులనుంచి బలవంతపు వసూళ్లకు ప్రయత్నించారని నార్త్-వెస్ట్ డీసీపీ అస్లాం ఖాన్ తెలిపారు. కీలక సమాచారం మేరకు గోయెల్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న తనను పిలిపించి, మత్తుమందు ఇచ్చి, ఒక ఫాం హౌస్‌లో సామూహిక అత్యాచారం చేశారని రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ గత నెలలో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అయిదుగురు వ్యాపారవేత్తలను నిందితులుగా పేర్కొంది. అయితే ఈ కేసులో ఆమె, గోయెల్‌తో కలిసి వ్యాపారవేత్తలను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఈ కేసును వెనక్కి తీసుకునేందుకు తన ముఠాతో కలిసి నిందితులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్న ఈమె ఇప్పటికే 1.1 కోట్ల రూపాయలు కూడా తీసుకుంది. అయితే తాజాగా మరింత డబ్బును డిమాండ్ చేస్తూ, వారిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వలపన్నిన పోలీసులు చాకచక్యంగా గోయల్ అండ్ గ్యాంగ్‌ను ట్రాప్ చేశారు. కేసును వాపస్ తీసుకునేందుకు 2.5 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా నటించి, వారి ఆటకట్టించారు. ఈ కేసులో ఆ మహిళను కూడా అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. కాగా ఘజియాబాద్‌కు చెందిన ఓ కంపెనీనీ రూ.16 లక్షలు మోసంచేసిన ఆరోపణలతో గోయల్‌పై గత ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఈ కేసులో దాదాపు మూడునెలల పాటు జైల్లో కూడా ఉన్నాడు. మే 31న అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
మరో రెండు రోజుల్లో చౌక ఫోన్!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత చౌకయిన ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లు రెండు రోజులు ఆలస్యంగా రానున్నాయి. జూన్ 30 నుంచి డెలివరీ చేస్తామని కొనుగోలుదారులకు రింగింగ్ బెల్స్ సంస్థ తెలిపింది. అయితే జూన్ 28 నుంచి డెలివరీ చేస్తామని అంతకుముందు ప్రకటించింది. ఆలస్యానికి కారణాలు వెల్లడి కాలేదు. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్లు అందిస్తామని రింగింగ్ బెల్స్ నాలుగు నెలల క్రితం చేసిన ప్రకటించడంతో అనూహ్య స్పందన వచ్చింది. లక్షలాది మంది ఈ ఫోన్ల కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిందరికీ ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ గోయెల్ హామీయిచ్చారు. ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ దక్కించుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని హన్స వర్మ అనే యువతి చెప్పింది. రింగింగ్ బెల్స్ వెబ్ సైట్ లో పలుమార్లు ప్రయత్నించి ఫ్రీడమ్ ఫోన్ కోసం ఆర్డర్ నమోదు చేశానని వెల్లడించింది. క్యాష్ ఆన్ డెలివరీ కింద తన పేరు నమోదు చేసుకున్నట్టు తెలిపింది. 'ముందుగా జూన్ 28న డెలివరీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మరో రెండు ఆలస్యమవుతుందంటున్నారు. దీంతో రింగింగ్ బెల్స్ కంపెనీపై అనుమానం కలుగుతోంది. రూ.251 ఫోన్ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్నాను. మరోసారి మోహిత్ గోయెల్ మాట మార్చరని భావిస్తున్నా'నని హన్స వర్మ పేర్కొంది. మొదటి విడత (2 లక్షల ఫోన్లు డెలివరీ చేస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ మాట నిలుపుకుంటుందో, లేదో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. -
రూ.251 ఫోన్ పై.. రూ.31 లాభం!
న్యూఢిల్లీ: అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ 'ఫ్రీడం 251' గురించి రింగింగ్ బెల్స్ కంపెనీ నుంచి ప్రకటన వెలువడగానే సంభ్రమాశ్చర్యంతో పాటు సందేహాలు, విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్య జనం ఆశ్చర్యపోగా, మార్కెట్ వర్గాలు విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వ వర్గాలు కూపీ లాగే పనిలో పడ్డాయి. ఇంత జరుగుతున్నా రూ.251 కే స్మార్ట్ ఫోన్ అందించి తీరతామని రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్ బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు ప్రతిఫోన్ పై తమకు రూ.31 లాభం వస్తుందని లెక్కలు వేసి మరీ చూపిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి ఫోన్లు డెలివరీ చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 18న ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వెంటనే 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. మొదటి విడతగా 25 లక్షల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మాత్రమే ఆమోదిస్తామని తెలిపారు. మరో 25 లక్షల ఫోన్లు ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్లకు జూన్ 30లోపు అందజేస్తామన్నారు. ఆన్ లైన్ కోనుగోలుదారుల నుంచి పేవ్ మెంట్ గేట్ వే ద్వారా వచ్చిన డబ్బును ప్రత్యేక ఖాతాలో ఉంచుతామని, ఫోన్లు డెలివరీ చేసిన తర్వాతే ఆ డబ్బు ముట్టుకుంటామని ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్యూలో గోయల్ స్పష్టం చేశారు. తాము ఎంతో కసరత్తు చేసిన తర్వాతే 'ఫ్రీడం 251' గురించి ప్రకటించామని, మోసం చేసే ఉద్దేశం తమకు లేదని అన్నారు. 'నేను, నా కంపెనీ ఆదాయపన్ను ఎగేసినట్టు ఒక్క ఫిర్యాదు లేదు. నాపై ఎటువంటి కేసులు లేవు. ఎందుకు నన్ను మోసగాడిగా చిత్రీకరిస్తున్నారు. నైతిక విలువలతో కూడిన వ్యాపారానికి కట్టుబడ్డా' అని గోయల్ పేర్కొన్నారు. కనీస ధరకు కంటే తక్కువకు అమ్మితే వచ్చే నష్టాన్ని తాము స్థాపించబోయే మార్కెటింగ్ వేదిక ద్వారా కవర్ చేస్తామని, ఈ మార్కెట్లో కొనుగోళ్ల ద్వారా లభించే లాభాలను తమ వినియోగదారుడికి బదిలీ చేయడం ద్వారా దీనిని అధిగమిస్తానని రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా అంతకుముందు వివరించారు.