రూ.251 ఫోన్ పై.. రూ.31 లాభం!
న్యూఢిల్లీ: అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ 'ఫ్రీడం 251' గురించి రింగింగ్ బెల్స్ కంపెనీ నుంచి ప్రకటన వెలువడగానే సంభ్రమాశ్చర్యంతో పాటు సందేహాలు, విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్య జనం ఆశ్చర్యపోగా, మార్కెట్ వర్గాలు విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వ వర్గాలు కూపీ లాగే పనిలో పడ్డాయి. ఇంత జరుగుతున్నా రూ.251 కే స్మార్ట్ ఫోన్ అందించి తీరతామని రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్ బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు ప్రతిఫోన్ పై తమకు రూ.31 లాభం వస్తుందని లెక్కలు వేసి మరీ చూపిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి ఫోన్లు డెలివరీ చేస్తామని ప్రకటించారు.
ఫిబ్రవరి 18న ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వెంటనే 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. మొదటి విడతగా 25 లక్షల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మాత్రమే ఆమోదిస్తామని తెలిపారు. మరో 25 లక్షల ఫోన్లు ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్లకు జూన్ 30లోపు అందజేస్తామన్నారు. ఆన్ లైన్ కోనుగోలుదారుల నుంచి పేవ్ మెంట్ గేట్ వే ద్వారా వచ్చిన డబ్బును ప్రత్యేక ఖాతాలో ఉంచుతామని, ఫోన్లు డెలివరీ చేసిన తర్వాతే ఆ డబ్బు ముట్టుకుంటామని ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్యూలో గోయల్ స్పష్టం చేశారు.
తాము ఎంతో కసరత్తు చేసిన తర్వాతే 'ఫ్రీడం 251' గురించి ప్రకటించామని, మోసం చేసే ఉద్దేశం తమకు లేదని అన్నారు. 'నేను, నా కంపెనీ ఆదాయపన్ను ఎగేసినట్టు ఒక్క ఫిర్యాదు లేదు. నాపై ఎటువంటి కేసులు లేవు. ఎందుకు నన్ను మోసగాడిగా చిత్రీకరిస్తున్నారు. నైతిక విలువలతో కూడిన వ్యాపారానికి కట్టుబడ్డా' అని గోయల్ పేర్కొన్నారు.
కనీస ధరకు కంటే తక్కువకు అమ్మితే వచ్చే నష్టాన్ని తాము స్థాపించబోయే మార్కెటింగ్ వేదిక ద్వారా కవర్ చేస్తామని, ఈ మార్కెట్‌లో కొనుగోళ్ల ద్వారా లభించే లాభాలను తమ వినియోగదారుడికి బదిలీ చేయడం ద్వారా దీనిని అధిగమిస్తానని రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా అంతకుముందు వివరించారు.