'ఫ్రీడం 251' డైరెక్టర్‌పై చీటింగ్ కేసు
'ఫ్రీడం 251' డైరెక్టర్‌పై చీటింగ్ కేసు
Published Thu, Feb 23 2017 7:57 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM
స్మార్ట్‌ఫోన్లను కేవలం రూ. 251కే ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసి, అనేక మందితో డబ్బులు కట్టించుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ డైరెక్టర్ మోహిత్ గోయల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. అతడిని పోలీసులు గురువారం నాడు అదుపులోకి తీసుకున్నారు. రింగింగ్ బెల్స్ సంస్థ తమను రూ. 16 లక్షల మేర మోసం చేసిందంటూ అయామ్ ఎంటర్‌ప్రైజెస్ అనే ఘజియాబాద్ సంస్థ ఫిర్యాదు చేయడంతో గోయల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై విచారించేందుకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఘజియాబాద్ డిప్యూటీ ఎస్పీ మనీష్ మిశ్రా తెలిపారు. 2015 నవంబర్ నెలలో గోయల్, ఇతరులు కలిసి ఫ్రీడమ్ 251 ఫోన్ల డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాల్సిందిగా తమను కోరారని అయామ్ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది.
ఇందుకుగాను ఆర్టీజీఎస్ ద్వారా తాము రూ. 30 లక్షలు చెల్లించామని, ఆకనీ ఇప్పటివరకు కేవలం రూ. 13 లక్షల విలువైన ఫోన్లు మాత్రమే వచ్చాయని చెప్పింది. ఆ తర్వాత ఎంతగా ఫాలో అప్ చేసినా కేవలం రూ. 14 లక్షల విలువైన డబ్బు, ఫోన్లు మాత్రమే అందాయన్నారు. మిగిలిన 16 లక్షల రూపాయల గురించి పదే పదే అడిగితే చంపేస్తామని కూడా తమను బెదిరించినట్లు అయామ్ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్న రింగింగ్ బెల్స్ సంస్థ గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి వెబ్‌సైట్ ద్వారా బుకింగులు మొదలుపెట్టింది. దాదాపు ఏడు కోట్ల మంది వరకు ఆ ఫోన్ల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఫోన్లు వచ్చింది మాత్రం చాలా తక్కువ మందికే కావడంతో చాలామంది కంపెనీపై అనుమానాలు వ్యక్తం చేశారు.
Advertisement