ఫ్రీడం 251:రింగింగ్ బెల్స్ ఆఫీస్ క్లోజ్!
న్యూ ఢిల్లీ: ఫ్రీడమ్ 251 పేరుతో ఇండియాలో అత్యంత చౌకయిన స్మార్ట్ఫోన్ అమ్మకాలకు ఆర్డర్లు తీసుకున్న తయారీ సంస్థ రింగింగ్ బెల్స్కు సంబంధించిన నోయిడా కార్యాలయం బుధవారం మూసివేసి ఉన్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఆఫీస్కు సంబంధించిన అద్దెను చెల్లించడంలో విఫలమైనందున ఆ కార్యాలయానికి తాళాలు పడినట్లు తెలుస్తోంది. అయితే రింగింగ్ బెల్స్ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా మాత్రం తాము పూర్తి స్థాయిలో వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని, ఎక్కడికి పారిపోవడం లేదని వెల్లడించారు.
రింగింగ్ బెల్స్ సంస్థ సీఈవో మోహిత్ గోయల్ను ఫ్రీడమ్ 251 మొబైల్ ధరను గురించి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. మొబైల్ల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న కస్టమర్ల డబ్బు విషయంలోనూ ఈడీ విచారణ చేపట్టినట్లు సమాచారం. దిగ్గజ సంస్థలకు సైతం సాధ్యం కానటువంటి అత్యంత చౌకయిన ధరకు స్మార్ట్ మొబైల్ను అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ముందుకు రావడంతో ఈ సంస్థపై ఇప్పటికే ప్రజల్లో పలు అనుమానాలున్న నేపథ్యంలో ఆఫీసును మూసేశారన్న వార్తలు మరింత కలకలం సృష్టిస్తున్నాయి.