రూ.251 ఫోన్లను పంపేస్తున్నాం
ఎప్పటినుంచో ఊరిస్తున్న ఫ్రీడమ్ 251 ఫోన్లు ఎట్టకేలకు వినియోగదారుల చెంతకు చేరబోతున్నాయి. మొదటి విడతగా మొత్తం 2,240 ఫోన్లను పంపినట్లు నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ సంస్థ తెలిపింది. పశ్చిమబెంగాల్ వినియోగదారులకు మొత్తం 540 ఫోన్లు, హర్యానాకు 390 యూనిట్లు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 605, బిహార్కు 484, ఉత్తరాఖండ్కు 221 ఫోన్లను పంపినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తొలి విడతలో ఇస్తామన్న మొత్తం 5వేల ఫోన్లలో మిగిలినవాటిని శనివారం పంపుతామని చెప్పారు.
ఫోన్లు అందుకున్నవాళ్లు మొత్తం రూ. 291 చెల్లించాలని, అందులో ఫోను ఖరీదు రూ. 251 కాగా, మిగిలిన 40 రూపాయలు డెలివరీ చార్జి అని కంపెనీ సీఈవో మోహిత్ గోయల్ తెలిపారు. ఈ ఫోన్ల కోసం మొత్తం 7.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని, లాటరీ ద్వారా మొదటి బ్యాచ్ వినియోగదారులను ఎంపిక చేశామని అన్నారు. 31.5 అంగుళాల ఎల్ఈడీ టీవీని, నాలుగు ఫీచర్ ఫోన్లను, రెండు స్మార్ట్ ఫోన్లను, మూడు పవర్ బ్యాంకులను కూడా రింగింగ్ బెల్స్ సంస్థ ఆవిష్కరించింది. ఫ్రీడమ్ 251 ఫోన్ల తయారీకి మొత్తం రూ. 1180 ఖర్చవుతుందని, అందులో రూ. 700-800 వరకు యాప్ డెవలపర్ల నుంచి తీసుకుంటున్నామని గోయల్ తెలిపారు. 251 రూపాయలకు ఫోన్ అమ్మినా, ఇంకా ఒక్కో సెట్ మీద రూ. 180 నుంచి 270 వరకు నష్టం వస్తుందని చెప్పారు.