251 ఫోను పర్వాలేదట!
ఈ రోజుల్లో 251 రూపాయలు పెడితే ఏమొస్తుంది.. మహా అయితే మల్టీప్లెక్స్లలో ఓ సినిమా చూసి, ఇంటర్వెల్లో కొంచెం పాప్ కార్న్ తిని రావచ్చు అంతే. కానీ ఆ ధరలో స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారంటే.. అసలు అందులో ఏముందో, ఎలా పనిచేస్తోందో అనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదూ. ఇప్పటికే దాదాపు 5వేల ఫోన్లను డెలివరీ చేశారు కాబట్టి వాటి పనితీరు ఎలా ఉందన్న విశ్లేషణలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ ఉంది. 4 అంగుళాల డిస్ప్లే, 3.2 మెగాపిక్సెల్ వెనక కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రస్తుతం అంతా 13 మెగాపిక్సెళ్ల వెనక కెమెరా, 5 మెగాపిక్సెల్ వరకు ఫ్రంట్ కెమెరాల యుగం నడుస్తుండటంతో.. కెమెరా విషయంలో కొంత అసంతృప్తి తప్పదు. కానీ, ఫోన్ మాత్రం బాగానే పనిచేస్తోంది.
ఇందులో 1 జీబీ ర్యామ్ ఉంది, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. ఇంటర్నల్ స్టోరేజికి 8 జిబి స్పేస్ ఇచ్చారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 1450 ఎంఏహెచ్. వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో లాంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. ఫోనుకు సమీపంలో ఏవైనా విద్యుదయస్కాంత క్షేత్రాలు ఉన్నాయేమో గమనించేందుకు ప్రాగ్జిమిటీ సెన్సర్ ఒకటి ఉంది. అలాగే కీప్యాడ్ లాక్ చేసి ఉన్నప్పుడు దాన్ని అన్లాక్ చేయాలంటే పవర్ బటన్ ఒత్తాల్సిన అవసరం లేదు.. స్క్రీన్ మీద వేలు ఆడిస్తే చాలు.. పాస్వర్డ్ అడుగుతుంది. వాట్సప్ కాలింగ్, మెసేజిలు, పాటలు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ లాంటివన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఫోను వేడెక్కడం కూడా లేదు. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే ఒకటిన్నర రోజుల పాటు ఉంటోంది.
ఆటోమేటిగ్గా హిందీలోకి..
అయితే ఇందులో ఓ చమక్కు కూడా కనిపిస్తోంది. బ్యాటరీ లో అయినప్పుడు టెక్స్ట్ సెట్టింగులు ఆటోమేటిగ్గా హిందీలోకి మారిపోతున్నాయి. వాటిని మనం మళ్లీ వెతుక్కుని ఇంగ్లీషులోకి మార్చుకోవాల్సి వస్తోంది. బహుశా రాబోయే ఫోన్లలో దీన్ని సరిచేస్తారేమో చూడాలి. మిగిలిన అన్న విషయాలు చూస్తే మాత్రం 251 రూపాయల ధరలో ఈమాత్రం స్మార్ట్ ఫోనురావడం ఎక్కువేనంటున్నారు.