సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చౌక ధరకే స్మార్ట్‌ఫోన్ అంటూ వార్తల్లో నిలిచిన రింగింగ్ బెల్స్ వ్యవస్థాపకుడు మోహిత్ గోయెల్ మరోసారి వెలుగులోకి వచ్చాడు. వ్యాపారవేత్తలను బెదిరించిన కేసులో ఢిల్లీ పోలీసులు మోహిత్ గోయెల్‌ను అరెస్టు చేశారు. ఒక మహిళతో కలిసి అక్రమంగా గ్యాంగ్‌రేప్ ఆరోపణలు చేయడంతో పాటు బలవంతపు వసూళ్ళకు పాల్పడిన కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ‘భీవాండి గ్యాంగ్ రేప్ కేసు' గా పేరొందిన కేసులో నిందితులుగా ఉన్న వ్యాపారవేత్తలపై ఓ మహిళతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందుతులనుంచి బలవంతపు వసూళ్లకు ప్రయత్నించారని నార్త్-వెస్ట్ డీసీపీ అస్లాం ఖాన్ తెలిపారు. కీలక సమాచారం మేరకు గోయెల్‌ను అరెస్ట్ చేశామన్నారు.
ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న తనను పిలిపించి, మత్తుమందు ఇచ్చి, ఒక ఫాం హౌస్‌లో సామూహిక అత్యాచారం చేశారని రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ గత నెలలో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అయిదుగురు వ్యాపారవేత్తలను నిందితులుగా పేర్కొంది. అయితే ఈ కేసులో ఆమె, గోయెల్‌తో కలిసి వ్యాపారవేత్తలను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఈ కేసును వెనక్కి తీసుకునేందుకు తన ముఠాతో కలిసి నిందితులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్న ఈమె ఇప్పటికే 1.1 కోట్ల రూపాయలు కూడా తీసుకుంది. అయితే తాజాగా మరింత డబ్బును డిమాండ్ చేస్తూ, వారిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వలపన్నిన పోలీసులు చాకచక్యంగా గోయల్ అండ్ గ్యాంగ్‌ను ట్రాప్ చేశారు. కేసును వాపస్ తీసుకునేందుకు 2.5 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా నటించి, వారి ఆటకట్టించారు. ఈ కేసులో ఆ మహిళను కూడా అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.
కాగా ఘజియాబాద్‌కు చెందిన ఓ కంపెనీనీ రూ.16 లక్షలు మోసంచేసిన ఆరోపణలతో గోయల్‌పై గత ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఈ కేసులో దాదాపు మూడునెలల పాటు జైల్లో కూడా ఉన్నాడు. మే 31న అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment