director arrested
-
కన్నడ దర్శకుడి అరెస్ట్
సాక్షి, బెంగళూరు: శాండిల్‌వుడ్ దర్శకుడు గురుప్రసాద్‌ను గిరినగర పోలీసులు అరెస్ట్ చేశారు. మఠ సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న గురుప్రసాద్ చెక్‌బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసం చేయటంతో పాటు అతడు ఇచ్చిన చెక్‌బౌన్స్ అయ్యింది. దీంతో శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. దర్శకుడు విచారణకు గైర్హాజరవ్వడంతో గురుప్రసాద్‌పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు గిరినగర పోలీసులు గురుప్రసాద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. -
'ఫ్రీడం 251' డైరెక్టర్‌పై చీటింగ్ కేసు
స్మార్ట్ఫోన్లను కేవలం రూ. 251కే ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసి, అనేక మందితో డబ్బులు కట్టించుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ డైరెక్టర్ మోహిత్ గోయల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. అతడిని పోలీసులు గురువారం నాడు అదుపులోకి తీసుకున్నారు. రింగింగ్ బెల్స్ సంస్థ తమను రూ. 16 లక్షల మేర మోసం చేసిందంటూ అయామ్ ఎంటర్ప్రైజెస్ అనే ఘజియాబాద్ సంస్థ ఫిర్యాదు చేయడంతో గోయల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై విచారించేందుకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఘజియాబాద్ డిప్యూటీ ఎస్పీ మనీష్ మిశ్రా తెలిపారు. 2015 నవంబర్ నెలలో గోయల్, ఇతరులు కలిసి ఫ్రీడమ్ 251 ఫోన్ల డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాల్సిందిగా తమను కోరారని అయామ్ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఇందుకుగాను ఆర్టీజీఎస్ ద్వారా తాము రూ. 30 లక్షలు చెల్లించామని, ఆకనీ ఇప్పటివరకు కేవలం రూ. 13 లక్షల విలువైన ఫోన్లు మాత్రమే వచ్చాయని చెప్పింది. ఆ తర్వాత ఎంతగా ఫాలో అప్ చేసినా కేవలం రూ. 14 లక్షల విలువైన డబ్బు, ఫోన్లు మాత్రమే అందాయన్నారు. మిగిలిన 16 లక్షల రూపాయల గురించి పదే పదే అడిగితే చంపేస్తామని కూడా తమను బెదిరించినట్లు అయామ్ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్న రింగింగ్ బెల్స్ సంస్థ గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి వెబ్సైట్ ద్వారా బుకింగులు మొదలుపెట్టింది. దాదాపు ఏడు కోట్ల మంది వరకు ఆ ఫోన్ల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఫోన్లు వచ్చింది మాత్రం చాలా తక్కువ మందికే కావడంతో చాలామంది కంపెనీపై అనుమానాలు వ్యక్తం చేశారు. -
షూటింగ్ స్పాట్ నుంచి దర్శకుడి అరెస్టు
అచ్చం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా.. ఓ కొత్త దర్శకుడిని సినిమా షూటింగ్ స్పాట్ నుంచి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఓ హత్యకేసులో ఆయన పాత్ర ఉండటంతో సివిల్ డ్రస్సులో వచ్చిన సీఐ, ఆయన బృందం కలిసి సంగీత్ లూయిస్ అనే దర్శకుడిని కేరళలోని కుందర ప్రాంతం నుంచి అరెస్టు చేశారు. ముందుగా లొకేషన్‌కు చేరుకున్న పోలీసులు ఇతర ప్రేక్షకులతో పాటు ఉండి, ఏమీ ఎరగనట్లుగా కాసేపు షూటింగ్ చూశారు. దాంతో సినిమా సిబ్బందితో పాటు ప్రేక్షకులకు కూడా ఎలాంటి అనుమానం రాలేదు. కాసేపటి తర్వాత వచ్చి, దర్శకుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీపు అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపిన కేసులో సంగీత్‌ను అరెస్టు చేశారు. గత సంవత్సరం జరిగిన ఈ సంఘటనలో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అప్పుడే కేసు నమోదైంది. నిందితులలో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే.. అప్పట్లో సంగీత్ ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడినుంచి అదృశ్యమయ్యాడు. ఇటీవల దర్శకుడి అవతారం ఎత్తాడు. దర్శకుడి నిజ స్వరూపం గురించి కొంతమంది స్థానికులకు అనుమానాలు రావడంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దాని ఆధారంగా షూటింగ్ ప్రదేశానికి వచ్చిన పోలీసులు, నిందితుడు అతడేనని నిర్ధారించుకుని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ సినిమాలో జాతీయ అవార్డు విజేత సూరజ్ వెంజరమూడు లాంటి అగ్రనటులు నటిస్తున్నా, అరెస్టు సమయానికి పెద్దనటులెవరూ అక్కడ లేరు.