అచ్చం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా.. ఓ కొత్త దర్శకుడిని సినిమా షూటింగ్ స్పాట్ నుంచి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఓ హత్యకేసులో ఆయన పాత్ర ఉండటంతో సివిల్ డ్రస్సులో వచ్చిన సీఐ, ఆయన బృందం కలిసి సంగీత్ లూయిస్ అనే దర్శకుడిని కేరళలోని కుందర ప్రాంతం నుంచి అరెస్టు చేశారు. ముందుగా లొకేషన్కు చేరుకున్న పోలీసులు ఇతర ప్రేక్షకులతో పాటు ఉండి, ఏమీ ఎరగనట్లుగా కాసేపు షూటింగ్ చూశారు. దాంతో సినిమా సిబ్బందితో పాటు ప్రేక్షకులకు కూడా ఎలాంటి అనుమానం రాలేదు. కాసేపటి తర్వాత వచ్చి, దర్శకుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు.
దీపు అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపిన కేసులో సంగీత్ను అరెస్టు చేశారు. గత సంవత్సరం జరిగిన ఈ సంఘటనలో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అప్పుడే కేసు నమోదైంది. నిందితులలో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే.. అప్పట్లో సంగీత్ ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడినుంచి అదృశ్యమయ్యాడు. ఇటీవల దర్శకుడి అవతారం ఎత్తాడు. దర్శకుడి నిజ స్వరూపం గురించి కొంతమంది స్థానికులకు అనుమానాలు రావడంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దాని ఆధారంగా షూటింగ్ ప్రదేశానికి వచ్చిన పోలీసులు, నిందితుడు అతడేనని నిర్ధారించుకుని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ సినిమాలో జాతీయ అవార్డు విజేత సూరజ్ వెంజరమూడు లాంటి అగ్రనటులు నటిస్తున్నా, అరెస్టు సమయానికి పెద్దనటులెవరూ అక్కడ లేరు.
షూటింగ్ స్పాట్ నుంచి దర్శకుడి అరెస్టు
Published Thu, May 1 2014 1:16 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
Advertisement
Advertisement