ఫ్రీడం రూ.251 ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
ముంబై: అతి చవకగా...రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ ఇటీవల సంచలనానికి తెరతీసిన రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవహారం గుర్తుందా. కోట్లాదిమంది ఎగబడి మరీ తమ పేర్లను నమోదు చేసుకున్న ఈ వివాదా స్పద ఫోన్లు ఎట్టకేలకు వినియోగదారులను మురిపించేందుకు రడీ అవుతున్నాయి. ఈ నెలలోనే ఆయా ఫోన్లను అందించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. జూన్ 28వ తేదీ నుంచి తమ ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని కంపెనీ డైరెక్టర్ మొహిత్ గోయల్ సోమవారం ప్రకటించారు. తమ ఫ్రీడం ఫోన్ల కోసం దాదాపు ఏడు కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, 30వేలమంది కాఫ్ ఆన్ డెలివరీ కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు.
రూ.251కే స్మార్ట్‌ఫోన్ అందజేస్తానని ప్రకటించి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి బుకింగ్ చేసిన వారికి స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేస్తామని ప్రకటించింది. గత ఫిబ్రవరిలో చేసిన సంస్థ ప్రకటనతో ముప్పై వేల మందికి పైగా ఫ్రీడమ్ 251 ఫోన్లను బుక్ చేశారు. మరో ఏడు కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
కాగా ప్రపంచంలోనే అతి చౌకగా ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల విక్రయానికి గత ఫిబ్రవరిలో కంపెనీ ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు ప్రకటన ఇచ్చింది. రూ.2,500 విలువైన స్మార్ట్ ఫోన్‌ను రూ.251కే అందిస్తున్నాని తెలిపింది. దీంతో ఫోన్ లవర్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. కుప్పలు తెప్పలుగా నమోదు చేసుకోవడం, తదనంతర పరిణామాలు వివాదానికి దారి తీశాయి. చివరికి టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ జోక్యం చేసుకుని ఐటి శాఖను కల్పించుకోవాల్సిందిగా కోరారు. ఐటి దాడులు జరిగాయి. అనేక విమర్శలు కూడా వెల్లువెత్తడంతో పాటు కంపెనీ పైన కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరి మరోసారి వివాదానికి తెర తీస్తుందా.. లేక వినియోగదారులను ఆకట్టుకుని మరో సంలచనానికి దారితీస్తుందా? వేచి చూడాల్సిందే.