థ్యాంక్ యూ బడ్డీ: కలాం
షిల్లాంగ్: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తుదిశ్వాస విడవడానికి కొన్ని నిమిషాల ముందు ఓ పోలీసుకు కృతజ్ఞతలు తెలిపారు. కలాం సహాయకుడు శ్రీజన్ పాల్ సింగ్ ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
సోమవారం షిల్లాంగ్ వెళ్లిన కలాం అక్కడ నుంచి తాను సెమినార్లో పాల్గొనాల్సిన ఐఐఎంకు రోడ్డు మార్గాన వెళ్లారు. కలాం కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న ఓపెన్ జిప్సీలో ఓ పోలీస్ నిలుచునే ఉన్నాడు. గంటసేపు ప్రయాణం సాగింది. జిప్సీలో పోలీస్‌ను గమనించిన కలాం.. 'అతను ఎందుకు నిలుచున్నాడు. అలిసిపోయినట్టున్నాడు. అతనికిది శిక్ష లాంటిది. ఆ పోలీస్‌ను కూర్చోమని వైర్లెస్ మెసేజ్ పంపమని చెబుతావా' అని తనతో చెప్పినట్టు శ్రీజన్ వెల్లడించారు.
ఐఐఎం భవనం వద్దకు చేరుకోగానే శ్రీజన్ పోలీస్‌ను కలాం దగ్గరకు తీసుకువెళ్లారు. కలాం.. పోలీస్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. 'థ్యాంక్ యూ బడ్డీ. అలసిపోయావా? ఏమైనా తింటావా? నాకోసం చాలా దూరం నిలుచుని వచ్చావు.. క్షమించు' అని కలాం గార్డుతో అన్నారు. ఐఐఎం భవనంలోకి వెళ్లిన కలాం కొన్ని నిమిషాల తర్వాత అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.