రూ. 3 లక్షలు పైబడిన నగదు లావాదేవీలను నిషేధించాలి
నల్లధనం నియంత్రణపై సుప్రీం కోర్టుకు సిట్ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు రూ. 3 లక్షలు పైబడిన నగదు లావాదేవీలపై నిషేధం విధించాలని, ఏ ఒక్కరూ రూ. 15 లక్షలకు మించి నగదు నిల్వ ఉంచకుండా చూడాలని నల్లధనంపై వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీం కోర్టుకు నివేదించింది. ఈ మేరకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని దర్యాప్తు బృందం సర్వోన్నత న్యాయస్థానానికి తన ఐదో నివేదిక సమర్పించింది. దేశంలో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని సంపద నగదు రూపంలో చలామణి అవుతోందని వెల్లడించింది.
నగదు లావాదేవీలకు సంబంధించి వివిధ దేశాల్లో అమల్లో ఉన్న చట్టాలను, వివిధ కేసుల్లో న్యాయస్థానాల పరిశీలనలు, మార్గదర్శకాలను పరిశీలించిన తరువాత నగదు లావాదేవీలపై గరిష్ట పరిమితి ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు సిట్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. రూ. 3 లక్షలు పైన నగదు లావాదేవీలను నిషేధించి, అటువంటి లావాదేవీలు చెల్లవని చట్టం చేయాలని సూచించిం ది. దర్యాప్తు సంస్థల సోదాల్లో కొన్నిసార్లు పెద్ద మొత్తంలో నగదు లభిస్తోందని, నగదు నిల్వపై పరిమితి విధించినపుడే నల్లధనం నిల్వలను అరిక ట్టే అవకాశం ఉంటుందని తెలిపింది. రూ. 15 లక్షలు గరిష్ట నగదు నిల్వ పరిమితిగా సూచించింది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి గానీ సంస్థ గానీ అంతకు మించి నగదు నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఆప్రాం తంలోని ఐటీ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాలని అభిప్రాయపడింది.
పన్ను చెల్లింపునకు గడువు పెంపు
నల్లధనానికి సంబంధించి ఒకే విడత ఆదాయ వెల్లడి పథకం కింద వెల్లడించిన ఆస్తులకు పన్ను, అపరాధ రుసుమును విడతల వారీగా చెల్లించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు లెక్కల్లో చూపించని ఆదాయంలో 45 శాతం పన్ను, సర్చార్జ్, పెనాల్టీ రూపంలో చెల్లించాలని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. నల్లధనం వెల్లడికి ఈ ఏడాది సెప్టెంబర్ 30 తుది గడువుగా వెల్లడించిన ప్రభుత్వం అక్కడి నుంచి మరో రెండు నెలలలోపు పన్ను చెల్లించాలని పేర్కొంది. కాని వెల్లడించిన ఆస్తులకు మూడు విడతల్లో 2017, సెప్టెం బర్ 30లోపు పన్ను, సర్చార్జ్, అపరాధ రుసుం చెల్లించ వచ్చని తాజాగా మినహా యింపు ఇచ్చింది. తొలి విడతగా ఈ ఏడాది నవంబర్ 30 లోపు విధించిన మొత్తం పన్ను, సర్చార్జ్, పెనాల్టీలో 25 శాతం చెల్లించాలని, రెండో విడతగా 2017, మార్చి 31 లోపు 25 శాతం చెల్లించాలని తెలిపింది. మిగతా 50 శాతం 2017, సెప్టెంబర్ 30 లోగా చెల్లించాలని ఆర్థిక శాఖ తెలిపింది.