సిప్ టైమ్... అయితే ఓకే!
స్టాక్ మార్కెట్లో తలపండిన వారు సైతం మార్కెట్ ఒడిదుడుకులను కచ్చితంగా అంచనా వేయడం కష్టమే. ఇక సామాన్యులెంత? సహజంగానే స్టాక్ మార్కెట్‌తో పెద్దగా పరిచయం లేని వారు ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. సరైన సమయం అనుకున్నపుడు ఎంత రిస్కయినా వెనకాడరు. మరికొంతమంది స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయిలకు చేరినప్పుడు ఇంకా పెరిగి లాభాలు అందిస్తాయని ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొందరైతే పడిపోతున్నప్పుడు అమ్ముకొని బయటపడాలని చూస్తారు. నిజానికి ఈ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి క్రమానుగత పెట్టుబడి(సిప్) చక్కటి మార్గం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలతో ఇన్వెస్ట్ చేసేవారికి ఇది చాలా మంచిది.
కొత్త వారిక్కూడా సిప్ బాగుంటుంది. నెలనెలా కొంత మొత్తం క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్నే ‘సిప్’ విధానం అంటున్నాం. దీంతో మార్కెట్లో టైమింగ్‌తో సంబంధం లేకుండా ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించొచ్చు.
క్రమశిక్షణ: సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుంది. మార్కెట్ పెరుగుతోందా లేక పడుతోందా అన్న భయాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు జూలై, 2008న నెలకు రూ.5,000 చొప్పున జూన్, 2013 వరకు అంటే ఐదేళ్లలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఈ ఐదేళ్లలో మార్కెట్ నికరంగా 8 శాతం రాబడినిచ్చింది. దీంతో ఈ విలువ రూ.3.67 లక్షలయింది. ఇది పూర్తిగా పన్ను రహిత లాభం. ముఖ్యంగా ఈ మధ్యలో మార్కెట్ భారీ ఒడిదుడుకులకు లోనయింది. కానీ సిప్ ఇన్వెస్టరు దానికి భయపడాల్సిన అవసరం లేకపోయింది.
రిస్క్ తగ్గుతుంది: ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత మార్కెట్లు పతనమైతే భారీ నష్టాలొస్తాయి. సిప్‌లో అయితే ఇలాంటి భయాలుండవు. ఉదాహరణకు ఈ నెల యూనిట్ ధర రూ.10 ఉన్నప్పుడు రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే చేతికి 100 యూనిట్లొస్తాయి. మరుసటి నెల మార్కెట్లు పడటం వలన యూనిట్ విలువ రూ.9 వచ్చిందనుకుందా. అప్పుడు రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే చేతికి 111 యూనిట్లు వస్తాయి. ధర పెరిగితే చేతి కొచ్చే యూనిట్లు తగ్గుతాయి. అదే ఒకేసారి రూ.10 వద్ద ఇన్వెస్ట్ చేస్తే 300 యూనిట్లు మాత్రమే వస్తాయి. నష్టం కూడా అధికంగా ఉంటుంది. తర్వాత కాలంలో మార్కెట్లు కోలుకుంటే అధిక ప్రయోజనం లభిస్తుంది.
చక్ర లాభం: పెట్టుబడులను ఎంత తొందరగా ప్రారంభిస్తే చక్రగతిన అంత ఎక్కువ లాభాలు పొందుతారు. ఉదాహరణకు రాము 20 ఏళ్ల వయసులో నెలకు రూ.5,000 చొప్పున ఐదేళ్లు ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. ఈ ఐదేళ్లలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.3 లక్షలు. రాము స్నేహితుడు శ్యామ్ మాత్రం ఐదేళ్లు ఆలస్యంగా అంటే 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఒకేసారి రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఇద్దరూ కూడా 50 ఏళ్లు పూర్తయితే కాని ఈ మొత్తం వెనక్కి తీసుకోకూడదనుకున్నారు. ఈ సమయంలో సగటున 10% రాబడిని లెక్కిస్తే రాము ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.46.7 లక్షలు అయితే, శ్యామ్ విలువ రూ.36.2 లక్షలే. ఇద్దరూ ఇన్వెస్ట్ చేసింది రూ.3 లక్షలే అయినా రాబడిలో ఎంత తేడా!! సిప్ విధానంలో ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు.