ఆ చార్జీలను తగ్గించిన ఎస్బీఐ
న్యూడిల్లీ: దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ ట్రాన్స్ఫర్ చార్జీలను భారీగా తగ్గించింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సఫర్ (ఎన్ఈఎఫ్టీ), రియల్ టైమ్ గ్రోస్ డెట్లెమెంట్ (ఆర్టిజిఎస్) ఛార్జీలు 75శాతం వరకు తగ్గించినట్టు గురువాం ప్రకటించింది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ , బ్యాంకు అందించే మొబైల్ బ్యాంకింగ్ సేవలు ద్వారా జరిగే లావాదేవీలలో తగ్గిన ఛార్జీలు వర్తిస్తాయని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తగ్గింపు ధరలు జూలై 15 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఎకానమీ సాధనలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించడానికే ఈ చర్య అని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్నీష్ కుమార్ చెప్పారు.
ఎన్ఈఎఫ్టీ
సవరించిన రేట్ల ప్రకారం నెఫ్ట్ లావాదేవీలకు రూ.10 వేలకు వరకు రూ. 2 బదులుగా ఇకపై ఒక రూపాయి వసూలు చేయనున్నారు. రూ.10వేల నుంచి లక్షరూపాయల వరకు ట్రాన్సఫర్పై ప్రస్తుత రూ. 4 కు బదులుగా 2 రూపాయలు వసూలు చేస్తారు. ఒక లక్ష నుంచి రెండులక్షలరూపాయల మధ్య రూ .12బదులుగా ఇకపై రూ. 3 చార్జ్ పడుతుంది.
ఆర్టీజీఎస్
రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల లావాదేవీపై రూ .20 స్థానంలో ఇకపై 5 రూపాయలు వసూలు చేయనున్నట్లు ఎస్బీ తెలిపింది. రు. 5 లక్షల పైన ట్రాన్సఫర్పై రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది.
కాగా మార్చి 31, 2017 నాటికి ఎస్బీఐ 3.27 కోట్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులుండగా దాదాపు 2 కోట్ల మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు నమోదయ్యారు. చిన్న లావాదేవీలకు ప్రోత్సాహించడంతోపాటు, జీఎస్టీ నేపథ్యంలో ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్) మనీ ట్రాన్సఫర్లపై కొత్త చార్జీలను ప్రకటించింది. రూ.1000 కి ఎలాంటి చార్జీలు లేకుండా, రూ.1000 నుంచి రూ.1 లక్ష కు రూ.5+జీఎస్టీ , రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల ట్రాన్సఫర్లకు రూ.15+జీఎస్టీ చార్జీలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.