‘మోనో‘ ప్రయాణికులకు చోరీల పరేషాన్
సాక్షి, ముంబై: మోనో రైలు సేవలకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అయితే ప్రస్తుత ం మొబైల్ ఫోన్ల చోరీ మొదలుకుని చైన్ స్నాచింగ్ లాంటి నేరాలతో రైల్వే పోలీసులు హైరానాపడుతున్నారు. రానున్న రోజుల్లో మోనో రైలులో కూడా ఇలాంటి సంఘటనలు జరగవచ్చనే సందేహాలు లేకపోలేదు. మోనో రైలు ప్రయాణికుల భద్రతా బాధ్యతలను రాష్ట్ర భద్రతా దళానికి అప్పగించారు. కానీ ఈ దళానికి కేసులు నమోదు చేసే అధికారాలు ఇవ్వలేదు.
దీంతో ఏదైనా ప్రమాదం, చోరీ సంఘటనలు చోటుచేసుకుంటే స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి వారిచే దర్యాప్తు చేయించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అంతేగాక ఈ రైలు మార్గం పూర్తిగా పైనుంచి (ఎలివేటెడ్) వెళ్లడం, స్టేషన్లు చాలా దగ్గర దగ్గరగా ఉండడంతో హద్దు వివాదం ఆయా పోలీసు స్టేషన్లలో తలెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) మోనో రైలు ప్రాజె క్టు చేపట్టింది. దీంతో ఈ ప్రాజెక్టుకు భద్రత కల్పించాలంటే నగర పోలీసులను రంగంలోకి దింపాల్సి ఉంటుంది. ప్రస్తుతం మోనో రైళ్లు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సేవలను అర్ధరాత్రి వరకు పొడిగించే అవకాశాలున్నాయి. అందుకు వివిధ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రమాదాలు జరిగితే ఎటు వెళ్లాలి?
ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల మాదిరిగా మహారాష్ట్ర సర్కారు స్థాపించిన భద్రత దళానికి మోనోరైలు భద్రత బాధ్యతలు అప్పగించారు. బ్యాంకుల్లో సాయుధ భద్రత సిబ్బంది మాదిరిగా ఈ దళానికి ఆయుధాలు కలిగి ఉండేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ రైళ్లలో జరిగే నేరాలు, నిందితులను పట్టుకోవాలన్నా లేదా కేసులు నమోదు చేయాలన్నాభవిష్యత్తులో ఈ దళాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.
ఒకవేళ బాధితులే స్వయంగా ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్కు వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలనే ప్రశ్న తలెత్తనుంది. రైలు ప్రారంభమైన స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ హద్దులోకి వస్తుందో అక్కడికి వెళ్లాలా..? లేదా ఆఖరు లేదా మధ్యలో ఆగిన స్టేషన్ ఏ పోలీస్స్టేషన్ హద్దులోకి వస్తుందో అక్కడి వెళ్లాలా..? అనేది తేల్చుకోవడంప్రయాణికులకు కష్టతరంగా మారనుంది. లేదంటే బాధితులు అటు, ఇటు పరుగులు తీయకతప్పదు.