మోనో రైల్ స్టేషన్లలో పీఎస్డీల ఏర్పాటు
సాక్షి, ముంబై : ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ) మోనో రైల్ స్టేషన్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. మోనోరైల్ కారిడార్లు అయిన చెంబూర్-వడాలా డిపో-జాకోబ్ సర్కిల్ (సంత్ గాడ్గే మహారాజ్)ల మధ్య వీటిని ఏర్పాటు చేయనుంది. అలాగే ప్లాట్‌ఫాం స్క్రీన్ డోర్ (పీఎస్డీ)లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి ట్రాక్‌ల నుంచి ప్లాట్ ఫాంలను వేరు చేయనున్నాయి. ప్లాట్ ఫాం అంచుల్లో ఆటోమెటిక్ స్లైడింగ్ డోర్లను అమర్చనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీఏ కమిషనర్ యూ.పి.ఎస్.మదన్ మాట్లాడుతూ... ప్లాట్ ఫాం స్క్రీన్ డోర్లను అమర్చే విషయమై యోచిస్తున్నామన్నారు. అయితే ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నదని, అందువల్ల చౌకగా లభించే మరో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నామన్నారు. కానీ ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. కాగా, వివిధ రకాల పీఎస్‌డీలు అందుబాటులో ఉన్నాయన్నారు. చాలా ఎత్తై డోర్లను సీలింగ్‌కు అటాచ్ చేసి ఉండే ఎత్తై డోర్లు ఒక రకమని, ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ఇటువంటివి ఉన్నాయని తెలిపారు.
మరికొన్ని ఎత్తై ద్వారాలుగా ఉంటాయి కాని సీలింగ్‌కు అటాచ్ చేసి ఉండవన్నారు. వీటిని పారిస్ సబ్వే స్టేషన్లో చూడవచ్చని చెప్పారు. మరికొన్ని పీఎస్‌డీలు రైళ్ల ఎత్తు కంటే కొంచెం తక్కువగా ఉంటాయని, వీటిని మలేషియాలోని కోలాలంపూర్‌లో, హాంకాంగ్‌లో కూడా చూడవచ్చని వివరించారు. కాగా, పీఎస్‌డీలు, రైళ్ల డోర్లు రెండూ ఒకేసారి ఓపెన్, క్లోజ్ అవుతాయని, వీటిని సెన్సార్ల ద్వారా నిర్వహించవచ్చని మదన్ పేర్కొన్నారు. ఈ డోర్లను అమర్చే వరకు మోనో రైలు సేవలను నిలిపి వేయాల్సిన అవసరం లేదన్నారు. రైల్ సేవల తర్వాత కూడా ఇందుకు సంబంధించిన పనులు చేపట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.