మొహం చాటేసిన టీడీపీ ఎమ్మెల్యే
నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ ‘ఎల్లో ట్యాక్స్’ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికార టీడీపీ ఆత్మరక్షణలో పడింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ నేతలతో రోజంతా మంతనాలు జరిపారు.
తర్వాత పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణ ప్రెస్ మీట్ ఉంటుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. ముందుచెప్పినట్టు పార్టీ ఆఫీసులో కాకుండా హోటల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే విలేకరుల సమావేశానికి రామకృష్ణ మొహం చాటేశారు. చివరకు మాంటెకార్లో కంపెనీ మాజీ ఉద్యోగి రామును మీడియా ముందుకు తీసుకొచ్చారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తంటాలు పడ్డాడు. ఫోన్ ఆడియోలో ఉన్న గొంతు తనదేనని ఒప్పుకున్నాడు.
ఓబులవారిపల్లి-కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులకు రూ.5 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే రామకృష్ణ బెదిరించినట్టు మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులు సోమవారం వెల్లడించారు. ఎమ్మెల్యే బెదిరింపుల ఆడియో సీడీలు మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యే దాష్టీకంపై రైల్వే మంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు.
రంగంలోకి సెంట్రల్ ఇంటెలిజెన్స్
ఎల్లో ట్యాక్స్ దందాపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఓబులవారిపల్లి-కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులు నిలిచిపోవడంపై ఆరా తీసింది. ఎమ్మెల్యే రామకృష్ణ రూ. 5 కోట్ల లంచం డిమాండ్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వివరాలు సేకరించింది. మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులతో ఇంటెలిజెన్స్ అధికారులు మాట్లాడినట్టు సమాచారం.