మాకు పీస్ బోనస్ ఇవ్వండి..!
న్యూఢిల్లీః తమకు పీస్ బోనస్ కావాలంటూ సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో రైలు, వాయు మార్గాలను అనుసంధానం చేయడంతోపాటు, అధ్వాన్నంగా ఉన్న రహదారుల పరిస్థితి మెరుగు పరిచేందుకు పీస్ బోనస్ ను అందించాలని విన్నవించారు. అంతేకాక దేశంలోనే అత్యంత శాంతియుత రాష్ట్రంగా సిక్కిం గుర్తింపు పొందిందని గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వంనుంచీ పీస్ బోనస్ ను కోరారు.
దేశంలోనే తమ రాష్ట్రం అత్యంత శాంతియుత రాష్ట్రం అని సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ అన్నారు. సిక్కింలో ఎటువంటి తీవ్రవాదం, హింస, విప్లవ ధోరణి లేదని, అందుకే తమకు ప్రత్యేకంగా శాంతి బోనస్ ఇవ్వాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. దశాబ్దాల తిరుగుబాటు తర్వాత 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మిజోరాం కు పీస్ బోనస్ గా 182.45 కోట్ల రూపాయలను అందించినట్లు ఆయన గుర్తు చేశారు. సిక్కింలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరగాలన్న ఆలోచన దశాబ్దాలుగా కొనసాగుతున్నా అమలుకు నోచుకోవడం లేదని, అలాగే రైళ్ళ అనుసంధానం విషయంలోనూ ఎటువంటి పురోగతి కనిపించడం లేదని తెలిపారు. తమకు లైఫ్ లైన్ గా అందుబాటులో ఉన్నది ఒక్క రహదారులేనన్న సీఎం.. వాటి పరిస్థితీ దీనావస్థలో ఉన్నట్లు వివరించారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సిక్కింతోపాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టాలని సీఎం పవన్ కుమార్ కోరారు. సిక్కిం.. భారత దేశంలో స్విట్జర్ ల్యాండ్ వంటిదని, సహజ వనరులతో పాటు బ్రహ్మాండమైన శక్తి కలిగిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంనుంచి సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు.