టీచర్ కన్నా.. డ్రైవర్ జీతం ఎక్కువ!
అహ్మదాబాద్: ఒక టీచర్ కన్నా.. స్కూల్ బస్సు డ్రైవర్‌కు ఎక్కువ జీతం ఇస్తామంటూ ప్రకటన ఇచ్చిన పాఠశాల వివాదంలో ఇరుక్కుంది. నగరంలోని గుజరాత్ కుమార్ వినయ్ మందిర్ స్కూల్ జూన్ పదో తేదీన ఉద్యోగ నియామకాల ప్రకటన ఇచ్చింది. పదో తరగతి పాసైన డ్రైవర్ కావాలంటూ జీతం రూ.7,000గా తెలిపారు. పక్కనే పాఠశాలలో అసిస్టెంట్ టీచర్లు అవసరమని, బీఈడీ చేసిన వారికి రూ.5,000 జీతంగా చెప్పారు. అనుభవమున్న డ్రైవర్‌కు వయోపరిమితి కూడా పెంచుతామని తెలిపారు. ఈ ప్రకటన చూసిన విద్యారంగ నిపుణులు, గాంధేయవాదులు ఈ ఉదంతంపై అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్, రిజిస్ట్రార్ లకు వందల సంఖ్యలో లేఖలు రాశారు.
ఆ విద్యాసంస్థపై కఠిన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఈడీ డిగ్రీ కలిగిన విద్యార్ధులందరూ డ్రైవర్ పోస్టుకు అప్లై చేయాలని పిలుపునిచ్చారు. టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లందరూ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని గాంధీలా నిరసన తెలపాలని గుజరాతీ లిటరేచర్ అసోసియేట్ ప్రొఫెసర్ యోగేంద్ర పరేఖ్ సూచించారు. ఈ రకమైన ప్రకటనలు ఇవ్వడం ద్వారా చదువుకున్న వారందరిని అవమానించారని అన్నారు. దీనిపై విద్యాపీఠ్ లో ఎవరూ నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని, ఒక టీచర్ పోస్టుకు మరీ అంత తక్కువ జీతాన్ని ఇస్తామని ప్రకటించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యారంగ నిపుణుల నుంచి వచ్చిన లేఖలపై స్పందించిన విద్యాపీఠ్ రిజిస్ట్రార్ రాజేంద్ర ఖిమని టీచర్ల జీతాలపై తనదైన భాష్యాన్ని వినిపించారు. డ్రైవర్ల పని సమయం 10 గంటలపాటు ఉంటుందని, టీచర్లకు కేవలం 6 గంటలేనని, అందుకే జీతం విషయంలో తేడాలున్నాయని చెప్పారు. అంతేకాకుండా టీచర్లు ఎక్కువకాలం తమ వద్ద ఉండట్లేదని తెలిపారు. ఎక్కువకాలం ఉద్యోగం చేస్తున్న టీచర్ల వేతనాలను క్రమంగా పెంచుతున్నట్లు చెప్పారు.