జనాభాలో మహిళలే అధికం
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో 27,90,069 మంది జనాభా ఉన్నట్లుగా లెక్క తేలింది. ప్రభుత్వం ఆగస్టు 19న నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో 25,27,849 మంది వివరాలు ‘కుటుంబ సర్వే వెబ్సైట్లో నిక్షిప్తం అయ్యాయి. మిగతా 2,62,220 మంది వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం కావాల్సి ఉంది. 25,27,849 మంది జనాభాలో పురుషులు 12,51,672 మంది ఉండగా, స్త్రీలు 12,66,498 మంది ఉన్నారు. దీని ప్రకారం చూసుకుంటే జనాభాలో పురుషుల కంటే స్త్రీలు అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. జిల్లా వ్యాప్తంగా 21,62,982 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. మిగతా వారికి లేవు. జిల్లా వ్యాప్తంగా 8,28,042 ఇళ్లు సర్వేలో వెల్లడి కాగా, 7,58,678 ఇళ్లు కంప్యూటర్లో నిక్షిప్తం అయ్యాయి.
జిల్లా జనాభా ఇలా..
కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలోని ఐదు డివిజన్లు ఉండగా, మంచిర్యాల, నిర్మల్ డివిజన్లలోని జనాభాలో మహిళలే అధికంగా ఉన్నారు. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో 5,46,427 మంది జనాభా ఉండగా, ఇందులో 2,78,053 మంది పురుషులు, 2,68,374 మంది స్త్రీలు ఉన్నట్లు తేలింది. డివిజన్లో మొత్తం 1,60,196 ఇళ్లకు గాను 5,46,427 మంది జనాభా ఉన్నట్లు లెక్కతేలింది.
►ఉట్నూర్ డివిజన్ పరిధిలో 3,14,974 మంది జనాభా ఉన్నారు. ఇందులో 1,57,672 మంది పురుషులు, 1,57,302 మంది స్త్రీలు ఉన్నారు. డివిజన్లో 72,551 ఇళ్లు ఉన్నాయి.
►ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మొత్తం 4,11,626 మంది జనాభా ఉండగా, ఇందులో 2,06,733 పురుషులు, 2,04,893 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం 1,21,534 ఇళ్లు ఉన్నట్లు లెక్కతేలింది.
►నిర్మల్ డివిజన్ పరిధిలో 5,34,285 మంది జనాభాకు 2,61,550 పురుషులు, 2,72,735 మంది స్త్రీలు ఉన్నారు. కాగా, డివిజన్లో 1,66,777 ఇల్లు ఉన్నాయి.
►మంచిర్యాల డివిజన్ పరిధిలో 7,20,537 మంది జనాభా ఉండగా, 3,57,343 మంది పురుషులు, 3,63,194 మంది స్త్రీలు ఉన్నారు. డివిజన్లో మొత్తం 2,37,623 ఇల్లు ఉన్నట్లుగా లెక్క తేలింది.
3,64,867 మంది ఆధార్ కార్డులు లేవు
►జిల్లాలో సుమారు లక్ష మందికిపైగా ఆధార్ కార్డులు లేవు. కంప్యూటర్లో నమోదైన సర్వే వివరాల ప్రకారంగా 99,743 మందికి ఆధార్ కార్డులు లేవు.
►ఆదిలాబాద్ డివిజన్లో మొత్తం 5,46,427 మంది జనాభాలో 4,36,680 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. 1,09,747 మంది కార్డులు లేవు.
►ఉట్నూర్ డివిజన్లో మొత్తం 3,14,974 మంది జనాభా ఉండగా, 2,69,827 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇంకా 45,147 మంది కార్డులు లేనట్లుగా లెక్కతేలింది.
►ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మొత్తం 4,11,626 మంది జనాభా ఉండగా, 3,55,929 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇంకా 55,697 మంది కార్డులు లేవు.
►నిర్మల్ డివిజన్ పరిధిలో 5,34,285 మంది జనాభా ఉండగా, 4,55,769 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. మిగతా 78,516 మందికి ఆధార్ కార్డులు లేవు.
►మంచిర్యాల డివిజన్లో 7,20,537 మంది జనాభా ఉండగా, 6,44,777 మందికి ఆధార్ కార్డులు ఉన్నట్లు, ఇంకా 75,760 మంది ఆధార్ కార్డులు లేనట్లుగా లెక్క తేలింది.