చివర్లో రికవరీ స్వల్ప నష్టాలతో ముగింపు
విదేశీ మార్కెట్ల నష్టాల నేపథ్యంలో దేశీ ఇండెక్స్‌లు బలహీనపడ్డాయి. వెరసి సెన్సెక్స్ వరుసగా మూడో రోజు నష్టాలతో ముగిసింది. తొలుత స్థిరంగా మొదలైనప్పటికీ ట్రేడింగ్ గడిచేకొద్దీ అమ్మకాలు పెరగడంతో ఒక దశలో 160 పాయింట్ల వరకూ క్షీణించింది. కనిష్టంగా 22,197ను తాకింది. అయితే చివర్లో జరిగిన షార్ట్ కవరింగ్ కారణంగా 22,343 వరకూ రికవర్ అయ్యింది. 16 పాయింట్ల స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంది. ఇక నిఫ్టీ మాత్రం ఒక పాయింట్ లాభపడి 6,695 వద్ద ముగిసింది.
టేకోవర్ షేర్ల హవా
ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీని టేకోవర్ చేస్తున్న సన్ ఫార్మా 3% ఎగసింది. కాగా, ర్యాన్‌బాక్సీ తొలుత 10% దూసుకెళ్లి రూ. 505ను తాకింది. ఇది ఏడాది గరిష్టంకాగా, చివరికి 3% నష్టంతో రూ. 445 వద్ద ముగిసింది. మరోవైపు లఫార్జ్, హోల్సిమ్ విలీన వార్తల కారణంగా సిమెంట్ కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి. అంబుజా సిమెంట్ 3% పుంజుకోగా, మరో సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ సైతం 3.5% జంప్ చేసింది. ఇతర దిగ్గజాలలో సెసాస్టెరిలైట్ 2.3% లాభపడగా, ఫలితాలు నిరుత్సాహపరచడంతో భెల్ అత్యధికంగా 3.3% క్షీణించింది. ఈ బాటలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్ 1.5% స్థాయిలో నీరసించాయి.