mortar shells rained
-
పాక్ పోస్టులపై బీఎస్ఎఫ్ మోర్టార్ల వర్షం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత గ్రామాలు, పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న పాక్ బలగాలకు దీటుగా జవాబిస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఉన్నతాధికారి ఒకరు సోమవారం తెలిపారు. పాక్ ఆర్మీ పోస్టులే లక్ష్యంగా ఇప్పటివరకూ బీఎస్ఎఫ్ 9,000 రౌండ్ల మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించిందని వెల్లడించారు. భారత బలగాలు చాలా కచ్చితత్వంతో చేసిన దాడిలో పాక్ ఆర్మీకి చెందిన పలు పోస్టులు, మోర్టార్ లాంచింగ్ ప్యాడ్లు, ఆయుధాలు, ఇంధన డంప్‌లు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. భారత బలగాల దాడిలో పాక్ రేంజర్ల ఇంధన డంప్ ధ్వంసమవుతున్న రెండు వీడియోల్ని విడుదల చేశారు. జమ్మూ వెంట ఉన్న 190 కి.మీల అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని తెలిపారు. జమ్మూలోని మక్వాల్–కనచక్ బోర్డర్ పోస్టుల మధ్య ఉన్న చికెన్‌నెక్ ప్రాంతంపై తొలిసారి పాక్ కాల్పులు జరిపిందని వెల్లడించారు. భారత బలగాల తీవ్ర ప్రతిస్పందనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ రేంజర్లను పోత్సహించేందుకు ఆ దేశ సీనియర్ ఆర్మీ కమాండర్లు సరిహద్దుకు చేరుకోవడాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. భారత బలగాలతో చర్చలు జరిపేందుకు, ఫ్లాగ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు పాక్ రేంజర్లు విముఖత చూపుతున్నారని చెప్పారు. కాల్పుల మాటున దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉండటంతో అంబుష్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. ఆగని పాక్ కాల్పులు జమ్మూ, రాజౌరీ జిల్లాల్లోని మూడు సెక్టార్లపై పాకిస్తాన్ బలగాలు సోమవారం కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఆదివారం సాయంత్రం నుంచి మొదలైన ఈ కాల్పులు సోమవారం తెల్లవారుజాము 5.45 గంటల వరకూ కొనసాగాయని ఓ బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. -
పుస్తకాల కోసం ప్రాణాలనూ లెక్కచేయలేదు..
పల్లన్ వాలా (జమ్మూకశ్మీర్): గిగ్రియాల్ గ్రామంపైకి పాకిస్తాన్ సైన్యం మోర్టార్‌షెల్స్ దూసుకొస్తున్నాయి. సైనికులంతా అప్రమత్తంగా ఉన్నారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇంతటి భీతావహ పరిస్థితిలోనూ సురీందర్ కుమార్ (15) ధైర్యం చేసి బయటికి వచ్చాడు. ఎందుకో తెలుసా? స్కూలు పుస్తకాల కోసం ! గత నెల 28న పాక్ సైన్యం మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడడంతో పల్లన్ వాలా సెక్టార్‌లోని గిగ్రియాల్ గ్రామస్తులను సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో వసతి శిబిరం ఏర్పాటు చేసింది. పదో తరగతి చదివే కుమార్ ఈ శిబిరం నుంచి ఇంటికి వెళ్లి పుస్తకాలు తీసుకొని వచ్చాడు. ‘ఆ రోజు హడావుడిగా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో స్కూలు బ్యాగ్ మర్చిపోయాను. రాత్రంతా నిద్రే పట్టలేదు. మరునాడు తెల్లవారి లేచాక కాలినడకన వెళ్లి పుస్తకాలు తీసుకొచ్చాను. మార్గమధ్యలో సైనికులు నన్ను ఆపి ప్రశ్నించగా, పుస్తకాల కోసం ఇంటికి వెళ్తున్నానని చెప్పాను. ఒక అధికారి నాకు సాయం చేశారు. నేను నడుస్తున్నంత సేపూ మోర్టార్‌షెల్స్ కురుస్తూనే ఉన్నాయి’ అని కుమార్ వివరించాడు. ఈ బాలుడి సాహసగాథ గురించి తెలియడంతో జమ్మూ డిప్యూటీ కమిషనర్ సిమ్రన్ దీప్ సింగ్ వసతి శిబిరాల వద్దే తాత్కాలిక పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అధికారులు శిబిరాల్లో ప్రత్యేక తరగతులు మొదలుపెట్టారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూడా కుమార్ వంటి బాలలు పట్టుదలతో చదువులను కొనసాగిస్తున్నారు.