Mosambi Market
-
బత్తాయి..భలే భలే..
సాక్షి, అమరావతి: మోసంబిగా పిలిచే బత్తాయి పండ్లకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. ఏపీలో సాగవుతున్న బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు సైతం ఏపీ నుంచే వెళ్తున్నాయి. కొంతకాలంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి నేపాల్‌కు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు ఇకనుంచి సింగపూర్, మలేషియా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ తదితర దేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బత్తాయి పండ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ ఏడాది పెద్దఎత్తున ఎగుమతి చేసేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జ్యూస్ ఎక్కువగా వచ్చే సాతుగుడి రకం బత్తాయిలను బెంగుళూర్, చెన్నై, ఢిల్లీ నుంచి విదేశాలకు పంపించనున్నారు. ఏపీలోనే సాగు అధికం బత్తాయి సాగు, దిగుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ పండే బత్తాయి పండ్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. సాగు విస్తీర్ణంలో సగానికి పైగా రాయలసీమ జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో సాతుగుడి, చీని రకాల బత్తాయి సాగవుతుండగా.. రైతులు ఏటా రెండు పంటలు తీస్తున్నారు. 2018–19లో రాష్ట్రవ్యాప్తంగా 2.14 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సాగు విస్తీర్ణం 2.85 లక్షల ఎకరాలకు విస్తరించింది. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు తోట బడుల పేరిట శిక్షణ ఇస్తుండటంతో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో పండే పంటలో 85 శాతం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. 15 శాతం మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు వెళుతోంది. మొదలైన ఎగుమతులు రాష్ట్రంలో సాగయ్యే బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతోంది. ప్రస్తుతం బత్తాయి కోతలు ప్రారంభం కాగా.. కళ్లాల నుంచే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఢిల్లీ మార్కెట్ నుంచి ఆర్డర్లు కూడా మొదలయ్యాయని అనంతపురానికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు తెలిపారు. ఈసారి విదేశాలకు సైతం బత్తాయిల ఎగుమతికి వ్యాపారులు పూనుకోవడంతో ధర కూడా మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ధర బాగుంది ఈసారి బత్తాయి పంట బాగుంది. రికార్డు స్థాయిలోనే దిగుబడి నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్య పలుకుతోంది. గతంలో ఎప్పుడూ ఈ సమయంలో ఇంత రేటు పలికిన సందర్భాలు లేవు. ఈసారి టన్ను రూ.లక్ష మార్క్‌ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్, ఉద్యాన శాఖ -
ఆ పథకాలు కేసీఆర్ ప్రకటించిన వరాలు: గుత్తా
సాక్షి, నల్గొండ : కోటిఎనభై లక్షలతో బత్తాయి మార్కెట్‌ను జిల్లాలో ఏర్పాటు చేయడం రైతులకు సంతోషకరమైన విషయమని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 2.5 లక్షల ఎకరాల భూమి సాగుకు అవకాశం ఉందన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, బ్రాహ్మణ వెళ్ళంల ప్రాజెక్టు ద్వారా మూడు నెలల్లో నీరు అందిస్తామని ప్రకటించారు. భూ రికార్డుల ప్రక్షాళన, ఎకారాకు ఎనిమిది వేల రైతు పెట్టుబడి, యాబై లక్షల రైతులకు ఐదు లక్షల బీమా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్పకుండా ఇచ్చిన వరాలని పేర్కొన్నారు. 130 కోట్లతో నల్గోండలో ఇంటింటికి నీరు అందించేందుకు సర్వం సిద్దమవుతోందని, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించింనందుకు ధన్యవాదాలు తెలిపారు. -
బత్తాయి మార్కెట్ హింసకు కాంగ్రెస్సే కారణం
హైదరాబాద్: నల్గొండలో బత్తాయి మార్కెట్ ప్రారంభం సందర్భంగా జరిగిన హింసకు కాంగ్రెస్సే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. తనను గెలిపిస్తే బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేయిస్తానని కోమటి రెడ్డి ప్రతి ఎన్నికలో చెప్పేవాడని, అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారని వాపోయారు. మూడేళ్లు తిరగకుండానే నల్గొండలో బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుల్లో ప్రభుత్వం పట్ల కనిపిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే కోమటి రెడ్డి కొత్త డ్రామాకు తెర లేపారని తెలిపారు. మేం బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే దాంట్లో చొరబడి స్వయంగా విధ్వంసం చేసింది కోమటి రెడ్డే కదా అని పేర్కొన్నారు. మా పార్టీ నేతలే ఈ దాడుల్లో టార్గెట్ అయ్యారని, మా వాళ్ల కార్లే ధ్వంసం అయ్యాయని వివరించారు. విచారణలో అన్నీ విషయాలు బయటికి వస్తాయన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే జానారెడ్డి, ఉత్తమ్, షబ్బీర్ అలీ, కోమటి రెడ్డి కి ఎలా వంత పాడుతారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నరరూప రాక్షసుల పార్టీ కాదు..కాంగ్రెస్సే నరరూప రాక్షసుల పార్టీ అని అనేక ఉదంతాలు తెలిపాయన్నారు. మీరు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు..ప్రతీకారం తీసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ వైఖరి మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఉందని చమత్కరించారు. -
కోమటిరెడ్డిపై నిప్పులు చెరిగిన జగదీశ్ రెడ్డి
నల్లగొండ: బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఫై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ది చెప్పాలన్నారు. గ్రామ గ్రామాన నిలదీయాలని విన్నవించారు. కోమటిరెడ్డి రెడ్డి నీ బెదిరింపులు నీ నాటకాలు నీ పక్కన వున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర చూయించు అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ జులుం తెరాస పార్టీపై చూయించడం మంచిది కాదని, దాడులు చేస్తే ఇలానే ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు. తాము ప్రజలకు మంచి చేస్తున్నామని..ఎవ్వరికీ భయపడమన్నారు. బత్తాయి మార్కెట శంకుస్థాపన సభలో కాంగ్రెస- టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహా బాహీ జరగడంతో మంత్రి జగదీశ్ రెడ్డి పై విధంగా స్పందించారు.