ఆవిష్కరణం: దోమల బ్యాట్
మనకంటే శక్తిమంతులతోనే కాదు.. చిన్న చిన్న కీటకాలపైనా కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడూ! సాయంత్రమైతే చాలు మనమీద యుద్ధం ప్రకటించేస్తుంటాయి దోమలు. కాయిల్స్ ఉన్నాయి, రెపెలెంట్స్ ఉన్నాయి.. కానీ వాటితో దోమలు చస్తాయన్న గ్యారెంటీ లేదు. అందుకే మనమే ఓ ఆయుధం చేతబట్టి దోమలపై యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి! ఆ ఆయుధమే.. ఎలక్ట్రిక్ ఫ్లైస్వాటర్. వాడుక భాషలో దోమల బ్యాట్. దోమ ఉన్న ప్రదేశంలో దాంతో ఓ విసురు విసిరామంటే చాలు.. టప్ మని శబ్ధం.. దోమ పని ఖతం! గత దశాబ్ద కాలంలో ఈ దోమల బ్యాట్ ఇండియాలో బాగా పాపులరయ్యింది. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇది వాడుకలోకి వచ్చి మూడు దశాబ్దాలపైనే అయివుంటుంది. అయితే దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. 1900 సంవత్సరంలోనే దీనిపై రాబర్ట్ మాంట్‌గోమరీ మొదటిసారి పేటెంట్ పొందారు.
దానికి ఆయన ఫ్లై కిల్లర్ అని పేరు పెట్టాడు. తర్వాత ఆ పేటెంటును జాన్ ఎల్.బెన్నెట్‌కు అమ్మేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న బ్యాటు తయారీ మాత్రం తొంభైల చివర్లో మొదలైంది. 1995లో తైవాన్‌కు చెందిన త్సాయి ఇ షిహ్ ఈ బ్యాట్ తయారీకి పేటెంట్ సంపాదించాడు. తర్వాత దోమల బ్యాట్ తయారీ ఆరంభమైంది. 2000కల్లా ఇవి మార్కెట్లోకి వచ్చాయి. 2005 నాటికి బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఛార్జింగ్ ద్వారా పనిచేసే ఈ బ్యాట్‌లో హ్యాండిల్లో బ్యాటరీ ఉంటుంది. ఎలక్ట్రిక్ తీగలతో నెట్ తయారు చేస్తారు. స్విచ్ ఆన్ చేయగానే వీటిలోకి విద్యుత్ ప్రసరిస్తుంది. ఐతే అది మనుషులకు హాని కలిగించే స్థాయిలో ఉండదు. దోమలు మాత్రం నెట్‌కు తగలగానే ప్రాణాలు వదులుతాయి. ఈ బ్యాట్‌తో దోమల్ని చంపడం పిల్లలతో పాటు పెద్దలకూ సరదానే!