ఉషారాణికి న్యాయం చేయాలి
మక్కువ : నిశ్చితార్థం జరిగిన తర్వాత ఎక్కువ కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెబుతున్న ఏఆర్ కానిస్టేబుల్ గోవిందపై చర్యలు తీసుకుని బాధితురాలు ఉషారాణికి న్యాయం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి డిమాండ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా శనివారం స్థానిక పోలీ స్ స్టేషన్ ఎదుట ఐద్వా, సీపీఎం, రైతు సంఘం, సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ రామభద్రపురం మండలం తారాపురం గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తుమరాడ... మక్కువ గుళ్లమజ్జి వీధికి చెందిన చోడవరపు ఉషారాణిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో నిచ్చితార్థం చేసుకున్నాడని, ఇప్పుడు పెళ్లికి ముఖం చాటేయడం దారుణమన్నారు. ఈ విషయమై బాధితురాలు గతంలో ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 22న మక్కువ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు విన్నవించుకుందని తెలిపారు.
అయినా గోవింద, ఆయన కుటుంభసభ్యులపై పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఈ నెల 26న సాలూరు సీఐ దేముళ్లు కానిస్టేబుల్ గోవింద తల్లిదండ్రులను స్టేషన్‌కు రప్పిస్తామని చెప్పినా ఇంతవరకు తీసుకురాలేదన్నారు. సీపీఎం నేత చింతల తవిటినాయుడు, రైతు సంఘం జిల్లాకార్యదర్శి కొల్లిగంగునాయుడు, సీఐటియూ నాయకుడు కె.శ్రీనువాసరావు లు మాట్లాడుతూ సీఐ వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఏఎస్ఐ గౌరీశంకర్ సంఘటన స్థలానికి వెళ్లి ప్రజాసంఘాల నాయకులు, బాధితురాలితో మాట్లాడారు. గోవిందపై కేసు నమోదు చేసి గాలిస్తున్నామని చెప్పారు. అనంతరం బాధితులు సీఐ దేముళ్లతో మాట్లాడాలని కోరడంతో ఏఎస్ఐ వెంటనే సీఐకు ఫోన్ చేసిన విషయం తెలిపా రు. గోవింద తల్లిదండ్రులను స్టేషన్‌కు రమ్మని పిలిచామని సీఐ తెలిపారు. దీంతో బాధితురాలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన విరమించారు.