కాకరకాయని కూడా కమ్మగా తినేస్తాను!
స్లిమ్‌గా, మోస్ట్ గ్లామరస్‌గా కనిపించే కాజల్ అగర్వాల్ మంచి ఫుడ్ లవర్. ‘అత్తారింటికి దారేది’ డైలాగ్ తరహాలో ‘ఏమేం తినాలో కాదు... ఎక్కడ ఏమేం తినకూడదో తెలిసినవారే నిజమైన ఫుడ్డీ’’... అచ్చం కాజల్లాగా. కాజల్ చెప్పే తిండి కబుర్లు.
పంజాబీ వంటకాల గురించి మాట్లాడుతుంటే నాకు నా చిన్నప్పటి సంఘటనలు గుర్తొచ్చేస్తున్నాయి. మా బామ్మ బాగా వంటలు చేసేది. అమృతం అంత పసందుగా ఏదీ ఉండదంటారు. మా బామ్మ చేతి వంట అమృతమే అనుకోండి. పంజాబీలు ఉదయం టిఫిన్‌గా దాదాపు పరోటాలే తింటారు. మా ఇంట్లో అయితే మా బామ్మ రోజూ అవే వండేది. ఉదయం వేడి వేడి పరోటాలు, కుర్మా లాగించేస్తుంటే ఎంతో కమ్మగా ఉండేది. ఇక, ఆదివారం అంటే మాకు చాలా ప్రత్యేకం. ఆ రోజు ఏది ఉన్నా లేకపోయినా రాజ్మా చావల్, పనీర్ మఖానీ, పరోటాలు ఉండాల్సిందే. ఆ రోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్‌కి బ్రేకే. దానికి బదులు ‘బ్రంచ్’ (ఉదయం టిఫిన్, మధ్నాహ్న భోజనం మధ్యలో దాదాపు పదకొండు గంటల ప్రాంతంలో తీసుకునేదాన్ని బ్రంచ్ అంటారు) ఏర్పాటు చేసుకుంటాం. నా కజిన్స్, ఇంకొంతమంది బంధువులు ఆ రోజు ఠంచనుగా మా ఇంటికి వచ్చేవారు. మేమంతా కలిసి బ్రంచ్ని ఓ పట్టుపట్టేవాళ్లం. ఆదివారం నాడు ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ఆరోజు రాత్రికి తప్పనిసరిగా పావ్ బాజీ చేసుకుంటాం.
నేను అసలు సిసలు పంజాబీ అమ్మాయిని. పరోటాలు, చోలే బటూరా (శెనగల కూర), రాజ్మా చావల్... ఇవన్నీ మొహమాటం లేకుండా లాగించేయడం నాకిష్టం. ఒకప్పుడు ఇవన్నీ ఎంతో ఆనందంగా తినేదాన్ని. అప్పుడు బరువు గురించి ఆలోచనే ఉండేది కాదు. కానీ, ఇప్పుడలా కాదు. ఇది తింటే ఇన్ని కేలరీలు పెరుగుతాయనీ, అది తింటే కొవ్వు పెరుగుతుందని.. ఇలా ఎన్నో లెక్కలు. హీరోయిన్ అన్న తర్వాత ఈ విషయంలో లెక్కలు తప్పితే, ఇక కెరీర్ అవుట్. అందుకే, సినిమాల్లోకొచ్చాక నచ్చిన వంటకాలకు కొంతవరకూ దూరం కాక తప్పలేదు. ముఖ్యంగా పిజ్జాలు, పనీర్ మఖానీ (పనీర్‌తో తయారు చేసే కూర) తినడం మానేశాను. మా అమ్మగారు మంచి కుక్. నా కోసం స్వయంగా తనే వండుతుంది. పనీర్, బటర్లాంటివి వాడొద్దని చెప్పేశాను. అలాగే, బియ్యానికి బదులు ‘క్యూనౌ’ (మంచి పోషకాలున్న ఒక రకమైన ధాన్యం) వాడుతున్నాను.
నేను ఒకప్పుడు మాంసాహారం తీసుకునేదాన్ని. కానీ, ఇప్పుడు శాకాహారిగా మారిపోయాను. ఎంతగా మారానంటే.. కాకరకాయని కూడా నొసలు చిట్లించకుండా ఆనందంగా తినేస్తాను. ఫిష్ ఫ్రైలు, చికెన్ కర్రీలకన్నా ఇప్పుడు పప్పు కూరలే నాకెంతో రుచిగా అనిపిస్తున్నాయి. చెప్పాలంటే నా శరీరం కూడా శాకాహారానికి బాగా అలవాటుపడిపోయింది.
సినిమాల్లోకి రాకముందు ఉత్తరాది వంటకాలకు మాత్రమే అలవాటుపడిన నేను దక్షిణాదికొచ్చిన తర్వాత ఆహార నియమాలు మార్చేసుకున్నాను. ఇడ్లీ, దోసెలు తినడం అలవాటయ్యింది. సాంబార్, పచ్చళ్లు కూడా తింటున్నాను. నా కజిన్స్ పంజాబ్‌లో ఉంటారు. ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు వాళ్ల దగ్గరకు వెళుతుంటాను.
అప్పుడు మాత్రం పరోటాలు ఓ పట్టుపడతాను. వాస్తవానికి నాకు విభిన్న రకాల వంటకాలను రుచి చూడాలని ఉంటుంది. కానీ, నోరు కట్టేసుకుంటాను. ముఖ్యంగా ముంబయ్‌లోని చర్చ్ గేట్ దగ్గర ఓ రెస్టారెంట్లో పసందైన పనీర్ మఖానీ తయారు చేస్తారు. ఇంకో చోట అయితే ముగలాయ్ (శాకాహారం, మాంసాహారంలో విభిన్న వంటకాలు), మరో చోట చైనీస్ వంటకం అయిన కమ్లింగ్ బాగా చేస్తారు. కానీ, నా డైటింగ్ నియమాల వల్ల వీటిని ఆరగించే అదృష్టం లేదు. ముంబయ్ వెళ్లినప్పుడు నా జిహ్వ చాపల్యంతో వీటిని తింటుంటాను. అయితే చాలా తక్కువ తింటాను.
సినిమా షూటింగ్స్ కారణంగా నాకు విదేశాలకు వెళ్లే అవకాశం దక్కుతోంది. అక్కడ కొన్ని రకాల వంటకాలు నాకు చాలా ఇష్టం. స్పెయిన్‌లో పొటాటోస్ బ్రావాస్ అనే డిష్ చాలా రుచికరంగా ఉంటుంది. బంగాళ దుంపలను వేయించి, సాస్‌తో కలిపి తినడం.. పొటాటోస్ బ్రావాస్ అంటే ఇదే. కానీ, ఈ ఫ్రైని రకరకాల పద్ధతుల్లో చేస్తారు. ఇటలీలో కాక్టైల్స్ ట్రై చేశాను. అవి చాలా టేస్టీగా అనిపించాయి. యూఎస్, శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే ఎక్కువగా పచ్చి కూరగాయలతో ఆహారం తయారు చేస్తారు. అవి ఆరోగ్యానికి చాలా మంచిది. తైవాన్, ఇండోనేసియాలో అయితే ఇడమామీ అనే వంటకం తయారు చేస్తారు.
ఆకుపచ్చ రంగు సోయా బీన్స్‌ని ఉడకబెట్టి, దానికి కొంచెం దినుసులు కలిపి ఇడమామీ వండుతారు. చాలా రుచిగా ఉంటుంది. ‘నీ ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్ ఏది?’ అని ఎవరైనా అడిగితే.. నేను దీన్నే చెబుతాను. థాయ్‌లో అయితే థాయ్ న్యూడిల్స్ చాలా ఇష్టం. జపాన్‌లో సుషీటాప్స్ ఇష్టం. సుషీ అనే బియ్యం ఉంటుంది. దాన్ని ఉపయోగించి, ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఇక, వియత్నాంలో అయితే కొత్తిమీర, పుదీన, బచ్చలి కూర, అల్లం, లెమన్ గ్రాస్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అక్కడి వంటకాలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఇటాలియన్ వంటకాల్లో పిజ్జా ఫేమస్. అది ఇష్టమైనా తినలేని పరిస్థితి.
మిఠాయిలను ఇష్టపడని వాళ్లు ఉంటారా? నేను చాలా స్వీట్ పర్సన్‌ని. స్వీట్స్ అని చెబుతుంటేనే నా నోరూరిపోతుంటుంది. చాక్లెట్స్ నా బలహీనత. మా అమ్మగారు చాక్లెట్ కేక్స్ తయారు చేస్తుంటారు. అలాగే, ఫ్రూట్ కేక్స్ చేయడంలో కూడా మా మమ్మీ బెస్ట్. చాక్లెట్స్, కేక్స్ గురించి పక్కన పెడితే... స్ట్రాబెర్రీలు, మామిడి పండ్లంటే చెప్పలేనంత ఇష్టం. మామిడిపళ్ల సీజన్లో అయితే రోజుకి కనీసం రెండు, మూడైనా తింటాను. కాకపోతే, స్ట్రాబెర్రీలతో పోల్చితే వీటిలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. అయినా, తింటాను. కానీ, వ్యాయామం టైమ్ పెంచుకుంటాను.
కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ తరచుగా తీసుకుంటా. ఐస్‌క్రీమ్ వద్దనుకుంటూనే లాగించేస్తా.
సన్నగా మెరుపు తీగలా ఉండటం కోసం కడుపు మాడ్చుకోవాలనే తరహా అమ్మాయిని కాదు నేను. నాకు నచ్చిన వంటకాలు తినడం కోసం ఒక్కోసారి నియమాలను ఉల్లంఘించేస్తాను. అందుకే, కఠినమైన డైట్‌ని ఆచరించేవాళ్లంటే నాకు చాలా అభిమానం. అదంత సులువైన విషయం కాదు. ఏదేమైనా, నా వృత్తంటే నాకు అపారమైన గౌరవం. అందుకే, ఆహారపరంగా చాలా త్యాగమే చేస్తున్నా. ఆ త్యాగానికి ప్రతిఫలం నా అభిమానుల రూపంలో దక్కుతోంది కాబట్టి... ఐయామ్ హ్యాపీ.