ప్రభుత్వ భృతితో లావవుతున్నారు
ప్రభుత్వ భృతి మీద ఆధారపడి బతికేందుకు పిల్లలను కనడమే పనిగా పెట్టుకున్నవారు లండన్‌లో ఎక్కువ మందే ఉంటారు. పనిచేయడానికి ఒళ్లు వంగనంత లావు (టూ ఫ్యాట్ టు వర్క్) ఉన్నారన్న కారణంగా కూడా ప్రభుత్వ భృతి మీద ఆధారపడి బతుకుతున్న జంటలు కూడా ఉండడం కాస్త ఆశ్చర్యమే!
45 ఏళ్ల స్టీవ్ బీర్, 43 ఏళ్ల మిషెల్లీ కూడా అదే కోవకు చెందిన జంట. 5.5 అడుగులున్న స్టీవ్ బీర్ 349 కిలోలుండగా, 4.4 అడుగులున్న మిషెల్లీ 147 కిలోల బరువున్నారు. వారు డేవన్ కౌంటీలోని ప్లైమౌత్ పట్టణంలో సింగిల్ బెడ్రూమ్ ఇంటిలో నివసిస్తున్నారు. గతంలో విండో క్లీనింగ్ బాయ్‌గా పనిచేసిన బీర్‌కు 2011లో అధిక బరువు వల్ల స్వల్పంగా హార్ట్ అటాక్ వచ్చిందట. పని చేయడం వల్లనే ఆర్ట్ అటాక్ వచ్చిందని భావించిన బీర్ ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్లో 'టూ ఫ్యాట్ టు వర్క్' అనే సర్టిఫికెట్ తీసుకొని వికలాంగుల కేటగిరీ కింద ప్రభుత్వం నుంచి నిరుద్యోగ భృతి పొందుతున్నాడు. అంతకుముందే నాలుగు పెళ్లిళ్లు చేసుకొని వారిని వదిలేసిన బీర్, తనలాగే లావున్న మిషెల్లీని పెళ్లి చేసుకున్నారు.
ఇప్పుడు వాళ్లిద్దరికీ కలిపి నెలకు రూ. 2 లక్షల నిరుద్యోగ భృతి వస్తోంది. దాంతో ఎంచక్కా వారు తమకిష్టమైన కిచెన్ కబాబ్‌లు తెగతింటూ రొప్పుతున్నారు. ఇటీవల కేఎఫ్‌సీకి వెళ్లి తమ పెళ్లి రోజును కూడా ఘనంగా జరుపుకున్నారు. రాత్రికి కావాల్సిన తిండి పదార్థాలను వెంట తెచ్చుకున్నారు. ఆ మధ్య వీరిద్దరిని 'ఛానెల్-5' ఇంటర్వ్యూ చేసింది. దీన్ని చూసిన టాక్స్ పేయర్స్ వారిపై మండిపడ్డారు. 'మోస్ట్ హేటెడ్ కపుల్'గా ముద్ర కూడా వేశారు. టాక్స్ పేయర్స్ గగ్గోలుతో మున్సిపల్ కౌన్సిల్ వారిని హెచ్చరించింది. బరువు తగ్గేందుకు కసరత్తు చేయాలని, అందుకు అవసరమైన వైద్య చికిత్స కోసం తాము ఇస్తున్న నెలవారీ భృతిని ఉపయోగించాలని సూచించింది.
ప్రస్తుతం తాము చేతనైన కాడికి వ్యాయామం చేస్తున్నామని, కొంత బరువు తగ్గామని ఆ జంట తెలిపింది. ప్రభుత్వ భృతి మీద ఆధారపడి జీవితాంతం బతకాలనే ఆలోచన తమకేమీ లేదని, అందుకే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నానని స్టీవ్ బీర్ మీడియాకు తెలిపారు.