కూలిన నగరంపై కొత్త పట్నం
మోసుల్ పేరు విన్నారా? అదేనండి.. ఈ మధ్య కాలంలో కరుడుకట్టిన ఉగ్రవాద మూక ఐసిస్ కబ్జా నుంచి విముక్తమైన ఇరాకీ నగరం. మూడేళ్ల ఐసిస్ దుశ్చర్యలకు ఈ నగరం కాస్తా కాంక్రీట్ దిబ్బగా మారిపోయింది. ఏదో అక్కడక్కడా ఒకట్రెండు భవనాలు మిగిలి ఉన్నాయేమో అంతే. ఎలాగూ ఐసిస్ పీడ విరగడైంది కాబట్టి.. ఈ నగరాన్ని మళ్లీ కట్టేయాలని స్థానిక ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఎలా కడితే బాగుంటుందో చెప్పమని ఈమధ్యే ఓ పోటీ పెట్టారు కూడా. ఒకసారి ఈ ఫొటోలవైపు చూడండి.
మోసుల్‌ను ఇలా ఒక ఓడలా మార్చేద్దామంటున్నారు విన్సెంట్ కాలెబో అనే ఆర్కిటెక్చర్ సంస్థ డిజైనర్లు! వారి ప్రతిపాదనలు ఎలాగున్నాయంటే... ఎలాగూ అక్కడ టైగ్రిస్ నదిపై ఐదు వంతెనలు ఉన్నాయి కదా.. వాటిపైనే ఇళ్లు కట్టేద్దాం.. అత్యాధునిక హైడ్రోపోనిక్స్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తే నగర వాసులకు అవసరమైన పంటలు అక్కడికక్కడే పండించుకోవచ్చు. అవసరమైన నీటిని టైగ్రిస్ నది నుంచి తోడుకోవచ్చు. అన్ని రకాల సేంద్రియ వ్యర్థాలను కూడా రీసైకిల్ చేస్తాము కాబట్టి... పంటలకు ఎరువుల కొరత ఉండదు.
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని వాడుకుని.. ఇస్లామిక్ సంప్రదాయ కళల స్ఫూర్తితో ఇళ్లు కట్టేద్దాం. పద్ధతిగా ఒకదానిపై ఒకటి పేర్చేసి.. అక్కడక్కడా గాలిమరలు, చిమ్నీలు ఏర్పాటు చేస్తే అడుగున ఉన్న టైగ్రిస్ నది నీటి ఆవిరి కారణంగా ఇళ్లల్లో ఉన్నవారందరికీ చల్లటిగాలి తగులుతూ ఉంటుంది. దీంతోపాటు ఇళ్లపైకప్పులపై వేసే సోలార్‌ప్యానెల్స్‌తో వేడినీటిని ఇవ్వొచ్చు. ఇక ఈ పచ్చటి నగరంలో వాడేసిన నీరు కూడా వృథా పోకుండా రీసైకిల్ చేసి మళ్లీ నదిలోకి వదిలేస్తే హోరున జారిపడే జలపాతాలూ అక్కడికక్కడే సృష్టించవచ్చు.... ఇలా ఉన్నాయి విన్సెంట్ కాలెబో ఆలోచనలు. ఇవన్నీ వాస్తవరూపం దాలుస్తాయా? ఎడారి రాజ్యంలో.. ఉగ్రవాద చర్యలతో సర్వనాశనమై పోయిన నగరంలో మళ్లీ పచ్చదనం అనే ఆశ చిగురిస్తుందా? చిగురిస్తే అద్భుతమే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్